ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి..
ABN , Publish Date - Apr 04 , 2026 | 10:38 AM
రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి బావిలో పడ్డ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
ముంబై, ఏప్రిల్ 4: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి బావిలో పడ్డ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ ఫ్యామిలీ మహారాష్ట్రలోని శివాజీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో ఇండోర్‌కు తిరుగు ప్రయాణం అయింది. సునీల్ దత్తాత్రేయ కారు డ్రైవ్ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే నాసిక్ జిల్లాలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో కారు అదుపు తప్పింది. రోడ్డు మీద నుంచి పక్కకు వెళ్లి నేరుగా బావిలో పడింది. కారులోంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో కారులోని వారందరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. నీటిలోంచి కారును క్రేన్ సాయంతో బయటకు తీసుకురావటానికి గంటల సమయం పట్టింది. కారులో ఉన్న 9 శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోంచి ఎగిరి నీటిలో పడ్డ బాలిక కోసం రెస్క్యూ సిబ్బంది బావిలో గాలిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని సునీల్ దత్తాత్రేయ, రేష్మ, గుణవతి, మాధురి, శ్రావణి, ఆశా అనిల్, శ్రేయాష్, శ్రిష్టి, సమృద్ధిగా గుర్తించారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉండటంతో బావి దగ్గరకు వచ్చిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి
క్యాతనపల్లి ఎన్నిక సజావుగా జరిగేలా చూడండి: బాల్క సుమన్