Share News

పర్షియన్‌ గల్ఫ్‌లో 38 భారత నౌకలు!

ABN , Publish Date - Mar 05 , 2026 | 06:30 AM

పర్షియన్‌ గల్ఫ్‌ జలాల్లో 38 భారత నౌకలు చిక్కుకున్నాయి. ఆ నౌకల్లో 1100 మందికి పైగా నావికులు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు...

పర్షియన్‌ గల్ఫ్‌లో 38 భారత నౌకలు!

ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ తరలిస్తున్న ఈ నౌకల్లో 1100 మందికి పైగా నావికులు

  • విదేశీ నౌకలపై దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి

న్యూఢిల్లీ, మార్చి 4: పర్షియన్‌ గల్ఫ్‌ జలాల్లో 38 భారత నౌకలు చిక్కుకున్నాయి. ఆ నౌకల్లో 1100 మందికి పైగా నావికులు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా ఉన్న హోర్ముజ్‌ జలసంధిని మూసివేశారు. దీంతో వందలాది నౌకలు సముద్ర మార్గంలోనే నిలిచిపోయాయి. పర్షియన్‌ గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ జలాల్లో 38 భారత జెండాలున్న నౌకలు ఉండిపోయాయి. వీటిలో కొన్ని నౌకలు ముడి చమురు, లిక్విఫైడ్‌ నేచురుల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ)ను భారత పోర్టులకు తరలిస్తుండగా, మరికొన్ని గల్ఫ్‌ దేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజా పరిస్థితిని నౌకాయాన మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఆయా కంపెనీలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. కాగా, ఒమన్‌ నౌకాశ్రయంలో ఉన్న విదేశీ నౌకలపై ఇరాన్‌ జరిపిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించగా, ఒకరు గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉదిక్త్రతలు కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతంలోని వివిధ నౌకల్లో మొత్తం 23 వేల మంది భారతీయ నావికులు ఉన్నారని, వారి భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, భారత నావికుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కంటెయినర్‌ నౌకలు పశ్చిమాసియాకు సేవలను నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నాయని తెలిపారు. హోర్ముజ్‌ మార్గంలో వెళ్లాల్సిన నౌకలు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మార్గం గుండా నడిపిస్తున్నారన్నారు.


హోర్ముజ్‌లో చైనా నౌకలకు అనుమతి

హోర్ముజ్‌ జల సంధి నుంచి చైనా నౌకలు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇస్తామని ఇరాన్‌ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత టెహ్రాన్‌పై దాడులను చైనా ఖండించిన సంగతి తెలిసిందే. అందుకు కృతజ్ఞతగా చైనా నౌకలను హోర్ముజ్‌ గుండా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్‌ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల నేపథ్యంలో హోర్ముజ్‌ జల సంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మేం రక్షణ కల్పిస్తాం: ట్రంప్‌

హోర్ముజ్‌ మీదుగా వెళ్లే చమురు ట్యాంకర్లకు అవసరమైతే అమెరికా నౌకాదళం రక్షణ కల్పిస్తుందని ట్రంప్‌ వెల్లడించారు. ఈ విషయమై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రపంచానికి ఇంధన సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు అమెరికా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ పెట్టారు.

భారత్‌, చైనాలకు చమురు సరఫరాను పెంచుతాం: రష్యా

హోర్ముజ్‌ జల సంధి మూసివేత, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, చైనాలకు రష్యా ఆఫర్‌ ఇచ్చింది. ఈ దేశాలకు చమురు సరఫరాను పెంచేందుకు సిద్ధమని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నొవాక్‌ బుధవారం ప్రకటించారు. భారత్‌కు రోజూ 25-27లక్షల బ్యారెళ్ల చమురు హోర్ముజ్‌ జల సంధి ద్వారా దిగుమతి అవుతుంది. ఈ చమురును ఇరాక్‌, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ల నుంచి కొనుగోలు చేస్తుంది. తాజా దాడుల నేపథ్యంలో చమురు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చదవండి:

ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..

జీడీపీకి చమురు సెగ

Updated Date - Mar 05 , 2026 | 06:30 AM