మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు అమెరికాలో కుట్ర.. హర్యానా సీఎం ఎంట్రీతో తప్పిన ముప్పు!
ABN , Publish Date - May 22 , 2026 | 09:12 PM
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో మరణించడానికి ఆరు సంవత్సరాల ముందే.. అమెరికా వేదికగా ఆయనను అంతమొందించడానికి ఒక భారీ కుట్ర జరిగింది.
ఆంధ్రజ్యోతి,మే 22: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి (మే 21) సందర్భంగా ఇటీవల దేశవ్యాప్తంగా నివాళులు అర్పించారు. అయితే, 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎల్టీటీఈ (LTTE) ఆత్మాహుతి దాడిలో ఆయన మరణించడానికి ఆరు సంవత్సరాల ముందే.. అమెరికా వేదికగా ఆయనను అంతమొందించడానికి ఒక భారీ అంతర్జాతీయ కుట్ర జరిగింది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నేతృత్వంలో జరిగిన ఈ భయంకరమైన ఖలిస్తానీ కుట్ర, కేవలం హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ అమెరికా పర్యటన కారణంగా అడ్డం తిరిగింది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ తెరవెనుక టెర్రరిస్ట్!
1985లో న్యూయార్క్‌కు చెందిన ఒక ప్రముఖ కంపెనీలో పనిచేసే ఫ్రెడ్ రొస్సెట్టి అనే ఎగ్జిక్యూటివ్ తన సహోద్యోగి గురించి మాట్లాడుతూ.. 'అతను చాలా విద్యావంతుడు, మర్యాదస్తుడు, చాలా బిడియస్తుడు. అతను ఒక ఉగ్రవాది అంటే నేను నమ్మలేకపోతున్నాను' అన్నాడు. ఆ సహోద్యోగి పేరే గురుప్రతాప్ సింగ్ బిర్క్ (జాన్ సింగ్). బ్రూక్లిన్‌లో ఉంటూ ఏడాదికి 60,000 డాలర్లు సంపాదిస్తూ, లండన్ నుంచి ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పొందిన ఈ టెకీ.. తెరవెనుక భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకున్న ఒక ప్రమాదకరమైన ఖలిస్తానీ ముఠాకు మాస్టర్‌మైండ్.
1984 అక్టోబర్‌లో ఇందిరా గాంధీ హత్య తర్వాత పంజాబ్‌లో ఉగ్రవాదం కోరలు చాచింది. విదేశాల్లోని కొందరు సిక్కు వేర్పాటువాదులు దీనికి మద్దతు ఇచ్చారు. ఇందిరా గాంధీ మరణం తర్వాత ఒక టీవీ డిబేట్‌లో బిర్క్ చేసిన వ్యాఖ్యలు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ (FBI) దృష్టిని ఆకర్షించాయి.
ఎఫ్‌బీఐ రంగ ప్రవేశం.. కుట్ర గుట్టురట్టు!
1985 జూన్‌లో అప్పటి యువ ప్రధాని రాజీవ్ గాంధీ అమెరికా పర్యటన ఖరారైంది. భారత్-అమెరికా సంబంధాలను సరికొత్తగా మార్చడానికి ఉద్దేశించిన పర్యటన ఇది. అయితే, ఈ పర్యటనలోనే రాజీవ్ గాంధీని హతమార్చాలని బిర్క్ ముఠా ప్లాన్ చేసింది.
బిర్క్ ఒక గన్‌రన్నర్ (ఆయుధాల స్మగ్లర్) సహాయం కోరగా.. అతను విషయాన్నిఎఫ్‌బీఐకి ఉప్పందించాడు. దీంతో ఎఫ్‌బీఐ ఒక అండర్‌కవర్ ఏజెంట్‌ను (వియత్నాం యుద్ధ వీరుడు థామస్ నోరిస్) ఒక పెద్ద కిరాయి ముఠా నాయకుడిగా బిర్క్ ముందుకు పంపింది. బిర్క్ ముఠా ఆ ఏజెంట్‌ను పూర్తిగా నమ్మి తమ ప్లాన్లను వివరించింది.
భయంకరమైన విష్‌లిస్ట్: జనవరి 26, 1985న జరిగిన సమావేశంలో భారత్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేయడానికి, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC), అణు విద్యుత్ కేంద్రాలు, ప్రధాన వంతెనలు, ప్రభుత్వ భవనాలను పేల్చివేయడానికి తమకు రసాయన ఆయుధాలు, ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ వెపన్స్ కావాలని కోరారు.
టెర్రర్ క్యాంప్: అమెరికాలోని న్యూజెర్సీ అడవుల్లో ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 100 మంది కమాండోలను తయారు చేసి భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఐదుగురిని పంపి అలజడి సృష్టించాలని ప్లాన్ చేశారు.
ఆ అడవుల్లోకి కారులో వెళ్తున్న సమయంలోనే, రాజీవ్ గాంధీని చంపడానికి ఒక పక్కా హిట్ మ్యాన్‌ను (షూటర్‌ను) ఏర్పాటు చేయాలని బిర్క్ ఎఫ్‌బీఐ అండర్‌కవర్ ఏజెంట్‌ను కోరాడు. ఇందుకోసం 60,000 డాలర్లు (అప్పట్లో భారీ మొత్తం) ఇస్తామని ఆఫర్ చేశాడు.
హర్యానా సీఎం ఎంట్రీ.. కథ అడ్డం తిరిగింది!
న్యూజెర్సీ క్యాంపునకు ఉగ్రవాదులంతా వచ్చాక కెమెరాల సాక్ష్యాలతో సహా అందరినీ ఒకేసారి పట్టుకోవాలని ఎఫ్‌బీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ ఇంతలోనే సీన్ లోకి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ వచ్చారు.
వైద్య చికిత్స కోసం భజన్ లాల్ అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ నగరానికి వచ్చారు. రాజీవ్ గాంధీ కంటే ముందే భజన్ లాల్ దొరకడంతో, ఖలిస్తానీ ముఠా తమ రూట్ మార్చింది. ముందు ఈయన్ని చంపేద్దాం అని ఫిక్స్ అయ్యి, ఎఫ్‌బీఐ ఏజెంట్ అనుకున్న వ్యక్తి ద్వారానే ఒక .45 కాలిబర్ పిస్టల్ కొనుగోలు చేశారు.
భజన్ లాల్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో ఎఫ్‌బీఐ ఇక వేచి చూడలేకపోయింది. మే 4, 1985న భజన్ లాల్ ఉంటున్న హోటల్ వెలుపల కారులో పొంచి ఉన్న గురుప్రతాప్ సింగ్ బిర్క్, అతని నలుగురు సహచరులను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఆ కారులో తుపాకులు, మ్యాపులు, భజన్ లాల్ ఫోటోలు దొరికాయి.
'మేము ఆ పెద్ద ముఠా మొత్తాన్ని పట్టుకునేవాళ్లం. కానీ భజన్ లాల్ గారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. మాకు వేరే దారి లేకపోయింది' అని అప్పట్లో అమెరికా ప్రాసిక్యూటర్ రోనాల్డ్ డెపెట్రిస్ పేర్కొన్నారు.
ఆ తర్వాత ఏం జరిగింది?
భజన్ లాల్ అలర్ట్‌తో రాజీవ్ గాంధీ ప్రాణాలు నిలిచాయి. జూన్ 11న ఆయన క్షేమంగా అమెరికా చేరుకుని ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్‌తో భేటీ అయ్యారు. నిందితుడు బిర్క్‌కు అమెరికా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అతని అనుచరులు లాల్ సింగ్, అమ్మంద్ సింగ్ తప్పించుకున్నారు. అమ్మంద్ సింగ్ 1988లో సీటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోగా, లాల్ సింగ్ చాలా ఏళ్ల పాటు తప్పించుకుని తిరిగి 1992లో బాంబేలో దొరికాడు.
భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జైన్ కమిషన్ (Jain Commission) నివేదిక ప్రకారం.. 1984 నుంచి 1991 మధ్య కాలంలో రాజీవ్ గాంధీని చంపడానికి బ్రిటన్ (IRA గన్‌మెన్ సహాయంతో), అమెరికా దేశాల్లో అనేక విఫలయత్నాలు జరిగాయి. చివరికి 1991లో శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ వేసిన ప్లాన్ విజయవంతమై దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోవాల్సి వచ్చింది.
Also Read:
వడదెబ్బ ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి
తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం? జగన్ తీరుపై మంత్రి గొట్టిపాటి ధ్వజం