కొత్త దుస్తులు కొన్నారా? ఈ తప్పు మాత్రం చేయొద్దు
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:54 PM
కొత్త దుస్తులు కొన్నాక చాలా మంది సాధారణంగా చేసే పొరపాటు ఒకటి ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పొరపాటు ఏమిటో? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: పండుగలు, పుట్టిన రోజుల కోసం అనేక మంది కొత్త దుస్తులు కొనుక్కుంటూ ఉంటారు. నచ్చిన దుస్తులను ఇంటికి తెచ్చుకున్నాక మరో ఆలోచన లేకుండా వాటిని ధరిస్తారు. వాటిని ముందుగా ఒకసారి ఉతకాలన్న విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. ఈ పొరపాటు చేస్తే అనేక సమస్యల పాలయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త దుస్తులు చూడటానికి అద్భుతంగా కనిపించినప్పటికీ అవి అంత శుభ్రంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉతకకుండా అలాగే ధరిస్తే చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
దుస్తులు తయారు చేసే క్రమంలో రకరకాల రసాయనాలను వినియోగిస్తారు. అవి ముడతలు పడకుండా ఉండేందుకు ఫార్మాల్‌డిహైడ్ రెసీన్‌ను వినియోగిస్తారు. ఈ కెమికల్ చర్మానికి తగిలితే అలర్జీ మొదలవుతుంది. దురదలు, దద్దుర్లు వంటివి మొదలవుతాయి. చర్మం సున్నితంగా ఉండేవారికి ఇలాంటి చిక్కులు మరింత ఎక్కువ.
ఇక షాపుల్లో ఇతర కస్టమర్లు కొత్త దుస్తులను ఒకసారి వేసుకుని తమకు సరిపోతుందో లేదో చెక్ చేసుకుంటారు. అలాంటి దుస్తులను వేసుకున్నప్పుడు హానికారక సూక్ష్మ క్రిముల బారిన పడే అవకాశం ఉంది.
ఇక ముదురు రంగులో ఉన్న దుస్తులపై రకరకాల రంగులు ఉంటాయి. ఇవన్నీ చర్మంపై హానికారక ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొత్త దుస్తులను జస్ట్ ఒక్కసారి ఉతికితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒక్క అలవాటుతో చిక్కులన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. కాబట్టి, మీరూ ఈ టిప్‌ను యథాతథంగా ఫాలో అయిపోండి!
ఈ వార్తలూ చదవండి:
తెల్ల జుట్టును నల్లగా మార్చే సహజ చిట్కా!
వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ