ఎండాకాలంలో కంటి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:11 PM
ఎండాకాలంలో కంటి రక్షణ కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలంలో చాలామంది తగినంత నీరు తాగడంపైనే దృష్టిపెడతారు. వడదెబ్బ కొట్టకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, ఈ కాలంలో కంటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ కాలంలో అధికంగా ఉండే దుమ్ము, ఉష్ణోగ్రతలు, సూర్యకాంతి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి చూపు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఎండాకాలంలో కళ్లను కాపాడుకునేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యులు చెప్పే దాని ప్రకారం ఈ కాలంలో ఎండ వేళ బయటకు వెళ్లేవారు కచ్చితంగా కూలింగ్ గ్లాసెస్‌ను ధరించాలి. దీంతో కంటిలో తేమ నిలిచే ఉంటుంది. సూర్యరశ్మిలోని యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. కళ్లల్లోకి దుమ్ము చేరకుండా ఈ కాలంలో జాగ్రత్త తీసుకోవాలి. అంటే.. మధ్యాహ్నం వేళల్లో వీలైనంత వరకూ బయటకు వెళ్లకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే కూలింగ్ గ్లాసెస్‌తో పాటూ టోపీ కూడా పెట్టుకుని వెళ్లాలి. దీంతో కళ్లకు గాడ్పు తగలకుండా ఉంటుంది. ఇరిటేషన్ ముప్పు తగ్గుతుంది. కూలర్లు, ఫ్యాన్‌ల నుంచి వచ్చే గాలి కూడా కళ్లు పొడిబారేలా చేస్తాయి కాబట్టి వీటి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఎక్కువ సేపు వాటి ముందు కూర్చోకూడదు.
కళ్లల్లో దుమ్మూధూళి పడినప్పుడు వెంటనే చేతులతో నలపకూడదు. ఇందుకు బదులు మంచి నీటితో కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కాలంలో తగినంత నీరు తాగడం ఎంతో ముఖ్యం. దీంతో, కళ్లు పొడిబారకుండా ఉంటాయి. ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పానీయాల వల్ల డీహైడ్రేషన్ బారినపడే అవకాశం ఉంది కాబట్టి ఎండాకాలంలో వీటి జోలికి వెళ్లకూడదు. ఇక ఎండాకాలంలో లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లను ఎక్కువ సేపు వాడకుండా ఉంటే కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.
ఈ వార్తలూ చదవండి:
ఉపవాసాలు ఉంటారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పలుచని కనుబొమ్మలకు సహజ పరిష్కారం