Share News

పేలుతున్న పాత టీవీలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:58 PM

దేశ వ్యాప్తంగా ఇటీవల చాలా ప్రాంతాల్లో పాత టీవీలు తరుచూ పేలుతున్నాయి. పాత టీవీలు ఎందుకు పేలుతున్నాయి? అవి పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పేలుతున్న పాత టీవీలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
old television

ఇంటర్‌నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో పాత టీవీలు పేలుతున్న సంఘటనలు బాగా పెరిగిపోయాయి. తాజాగా.. కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు గ్రామంలో బుధవారం ఓ పాత టీవీ పేలింది. ఈ సంఘటన జరిగిన రోజు రాత్రి చిన్న ఓబులేషు అనే వ్యక్తి తన ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నాడు. టీవీ నుంచి వింత శబ్దాలు రావడంతో బయటకు పరుగులు తీశాడు. కొద్దిసేపటికే ఆ టీవీ పెద్ద శబ్దంతో పేలిపోయింది. గత డిసెంబర్‌లో అదే ఊరిలోని ఓ ఇంట్లో పాత టీవీ పేలింది. కేవలం ఆ గ్రామంలోనే కాదు.. ఇటీవల తరచూ దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పాత టీవీలు పేలుతున్నాయి. అవి ఎందుకు పేలుతున్నాయి? పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?


పాత టీవీలు పేలడానికి కారణం ఏంటి?

పాత టీవీలు పేలడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవిగా వీటిని చెప్పుకోవచ్చు.

  • కెపాసిటర్లు పూర్తిగా పొడి బారిపోవటం.

  • లోపల చెత్త పేరుకుపోవటం వల్ల బాగా హీటెక్కిపోవటం.

  • లూజ్ కనెక్షన్లు.

  • పవర్ సప్లైలో హెచ్చుతగ్గులు.

  • సీఆర్‌టీ టీవీల్లో హైఓల్టేజ్ సమస్యలు రావటం.


పాత టీవీలను ఎలా వాడుకోవాలి?

  • పాత టీవీలకు కచ్చితంగా స్టెబిలైజర్ వాడాల్సిందే. అది కూడా మంచి కంపెనీకి చెందినదై ఉండాలి.

  • గాలి, సరైన వెలుతురు తగిలే చోట టీవీలను ఉంచాలి.

  • టీవీలను గోడకు అతి దగ్గరగా ఉంచకూడదు. కనీసం 6 నుంచి 8 అంగుళాల దూరం ఉంచాలి.

  • టీవీలో దుమ్ము చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.

  • పాత టీవీలను ఎక్కువ గంటలు ఏకధాటిగా వాడకూడదు. ప్రతి రెండు నుంచి మూడు గంటలకోసారి విరామం ఇస్తూ ఉండాలి.

  • టీవీని సరైన విధంగా ఆఫ్ చేయాలి. వర్షాలు పడుతున్న సమయంలో ప్లగ్‌ను స్విచ్ బోర్డు నుంచి పూర్తిగా తొలగించాలి.


టీవీ కొని 10 నుంచి 12 సంవత్సరాలు అవుతుంటే కచ్చితంగా వాటి వాడకం తగ్గించాలి. లేదా పూర్తిగా దాన్ని వాడటమే మానేయాలి. ఒకవేళ వాడాలని అనుకుంటే ప్రతీ రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి విరామం ఇస్తూ ఉండాలి. వింత శబ్దాలు, పొగ, వాసన వస్తున్నా.. పదే పదే టీవీ ఆఫ్ అవుతున్నా జాగ్రత్త పడండి. దాన్ని ఉపయోగించకుండా ఉండటమే మంచిది.


ఇవి కూడా చదవండి

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

భయమెరుగని నాయకత్వ పటిమకు నేతాజీ ప్రతీక: ప్రధాని మోదీ

Updated Date - Jan 23 , 2026 | 03:33 PM