ప్రొటీన్ పుష్కలంగా ఉండే శాకాహారాలు ఇవే
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:23 PM
ప్రొటీన్ అంటే చాలామంది ముందుగా మాంసాహారాన్నే గుర్తు చేసుకుంటారు. కానీ శాకాహారంలో కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించే ఎన్నో పోషకాహారాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రొటీన్ ఎంతో అవసరం. కండరాల నిర్మాణం, కణాల మరమ్మత్తు, శక్తి స్థాయిలను నిలబెట్టుకోవడంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలామంది ప్రొటీన్ అంటే మాంసాహారంలోనే ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ శాకాహారంలో కూడా ప్రొటీన్ సమృద్ధిగా లభించే ఎన్నో ఆహారాలు ఉన్నాయి. వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను సులభంగా పొందవచ్చు.
రోజూ తగినంత ప్రొటీన్ తీసుకోకపోతే శారీరక బలహీనత, అలసట, కండరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామం చేసే వారు, జిమ్‌కు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం.
పనీర్
శాకాహారులకు పనీర్ మంచి ప్రొటీన్ వనరుగా చెప్పవచ్చు. ఇందులో ప్రొటీన్‌తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. పనీర్ తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. సలాడ్లు, కూరలు లేదా స్నాక్ రూపంలో తీసుకోవచ్చు.
కాయధాన్యాలు
కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, మసూర్ దాల్ వంటి కాయధాన్యాల్లో ప్రొటీన్‌తో పాటు ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి.
మీల్ మేకర్
మీల్ మేకర్‌ను 'ప్రొటీన్ పవర్‌హౌస్'గా పిలుస్తారు. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉండటంతో కండరాల పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటిని కూరలు, పులావ్ లేదా సలాడ్‌లలో చేర్చుకుని తినవచ్చు.
శనగలు, బీన్స్
శనగలు, అలసందలు, ఇతర బీన్స్‌లో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మేలు చేయడంతో పాటు శరీరానికి శక్తినిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.
మొలకెత్తిన శనగలు
మొలకెత్తిన శనగలు పోషకాల నిలయం. వీటిలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అల్పాహారంగా వీటిని తీసుకుంటే రోజంతా శక్తిగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే బరువు నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుపడటానికి కూడా ఉపయోగపడుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్