Earphones Volume Limit: ఇయర్ ఫోన్స్ సౌండ్ ఎంత వరకూ ఉండవచ్చో తెలుసా?
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:47 PM
ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? మీరు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో వివరంగా తెలుసుకుందాం పదండి
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయింది. ఎవరిని చూసినా వీటిని తగిలించుకునే కనిపిస్తున్నారు. ఈ అలవాటు కారణంగా యువతలో వినికిడి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వృద్ధుల్లో కనిపించే సమస్యలు నేటి జమానాలో యువతలో కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
వైద్యులు చెప్పే దాని ప్రకారం, నిత్యం ఇయర్‌ఫోన్స్‌ను వాడే వారిలో పలు సమస్యలు కనిపిస్తాయి. కొందరిలో చెవిలో ఏదో శబ్దం నిత్యం వినిపిస్తూ ఉంటుంది. చుట్టూ శబ్దాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవతలి వారు చెప్పేది అర్థం కాక ఇబ్బంది పడతారు. ఫోన్ లేదా టీవీని ఎక్కువ శబ్దంతో వినాల్సి వస్తోందంటే కూడా వినికిిడి సమస్య మొదలైనట్టే. ఈ మార్పులను నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా వినికిడి శక్తి దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది యువత ఈ మార్పులను సరిగా గమనించక చిక్కుల్లో పడుతున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఆడియో ఉపకరణాలు 100-110 డెసిబెల్స్ వరకూ కూడా శబ్దాన్ని విడుదల చేయగలుగుతున్నాయి. 15 నిమిషాల పాటు ఏకధాటిగా ఇంతటి శబ్దాలను వింటే మాత్రం శాశ్వతంగా వినికిడి శక్తి దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఈ ముప్పు తప్పాలంటే ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ సౌండ్‌ను తక్కువగా పెట్టుకోవాలి. ఈ దిశగా 60-60 ఫార్ములాను ఫాలో కావాలి. అంటే.. ఇయర్‌ఫోన్స్ గరిష్ఠ శబ్దంలో 60 శాతానికి మించి వాల్యూమ్‌ను పెంచకూడదు. అంతేకాకుండా, గంటకు మించి ఇయర్‌ఫోన్స్‌ను వాడకూడదు. అంతేకాకుండా, గంట పాటు వాడాక ఒక పదిహేను నిమిషాల పాటు వాటిని పక్కన పెట్టేయాలి. నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌ను వాడితే మరింత తక్కువ వాల్యూమ్‌లో సౌండ్ సెట్ చేసుకుని చక్కగా పాటల్ని ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సూచనలను తూచా తప్పకుండా ఫాలో అయిపోండి.
ఇవీ చదవండి:
మీరు స్టూడెంటా? చదివింది ఎక్కువ కాలం పాటు గుర్తుండిపోవాలంటే..
మధ్య వయసులో ఈ లక్షణాలు.. రాబోయే మతిమరుపునకు సంకేతం