Share News

కేవలం రూ.50తో ఇంట్లోనే 3 సహజమైన లిప్ బామ్‌లు..

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:44 PM

చాలామందికి పెదాలు పొడిబారి పగిలిపోతుంటాయి. ఇలాంటి సమయంలో ఖరీదైన లిప్ బామ్‌లు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా దొరికే సహజ పదార్థాలతో రూ.50లోపే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కేవలం రూ.50తో ఇంట్లోనే 3 సహజమైన లిప్ బామ్‌లు..
Homemade lip balm

ఇంటర్నెట్ డెస్క్: పెదాలు పొడిబారడం, పగిలిపోవడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. దీంతో పెదవులు అందంగా కనిపించకపోవడమే కాకుండా కొన్నిసార్లు నొప్పి, రక్తస్రావం కూడా కలుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది మార్కెట్లో లభించే లిప్ బామ్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో రసాయనాలు ఉండటంతో పాటు ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సహజమైన పదార్థాలతో రూ.50లోపే లిప్ బామ్ తయారు చేసుకుని పెదవులను మృదువుగా ఉంచుకోవచ్చు.


చియా గింజలు – కొబ్బరి నూనె లిప్ బామ్

పెదాలు ఎక్కువగా పొడిబారే వారికి ఈ లిప్ బామ్ మంచి ఎంపిక. కొబ్బరి నూనె పెదాలకు తేమను అందిస్తే, చియా గింజలు పోషణ అందిస్తాయి.

తయారీ విధానం:

  • ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను స్వల్పంగా వేడి చేయాలి.

  • అందులో అర టీస్పూన్ చియా గింజల పొడి వేసి బాగా కలపాలి.

  • 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచాలి.

  • తర్వాత చిన్న డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో అరగంట ఉంచితే లిప్ బామ్ సిద్ధమవుతుంది.


బీట్‌రూట్‌ లిప్ బామ్

పెదాలకు సహజమైన గులాబీ రంగు రావాలనుకుంటే బీట్‌రూట్‌తో లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం:

  • చిన్న బీట్‌రూట్ ముక్కను తురిమి రసం తీసుకోవాలి.

  • ఒక టీస్పూన్ వాసెలిన్ లేదా పెట్రోలియం జెల్లీని డబుల్ బాయిలర్ పద్ధతిలో కరిగించాలి.

  • అందులో అర టీస్పూన్ బీట్‌రూట్ రసం కలిపి బాగా మిక్స్ చేయాలి.

  • ఈ మిశ్రమాన్ని చిన్న డబ్బాలో పోసి చల్లారనివ్వాలి.

గట్టిపడిన తర్వాత సహజమైన టింటెడ్ లిప్ బామ్ సిద్ధమవుతుంది.


తేనె – పాల మీగడ లిప్ బామ్

పెదాలు పగిలి నొప్పిగా ఉన్నప్పుడు ఈ లిప్ బామ్ ఉపయోగపడుతుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదాలను రక్షిస్తే, పాల మీగడ వాటిని మృదువుగా ఉంచుతుంది.

తయారీ విధానం:

  • అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ తాజా పాల మీగడ తీసుకోవాలి.

  • రెండింటినీ బాగా కలిపి క్రీమ్‌లా తయారు చేయాలి.

  • చిన్న డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.

  • ఇందులో పాల మీగడ ఉండటం వల్ల ఒక వారంలోపు ఉపయోగించడం మంచిది.

  • రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసుకుంటే మరుసటి రోజు మృదువైన, నిగనిగలాడే పెదవులు పొందవచ్చు.


గుర్తుంచుకోవాల్సిన విషయం

ఇంట్లో తయారు చేసే ఈ సహజమైన లిప్ బామ్‌లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. అయితే చర్మం సున్నితంగా ఉండేవారు లేదా ఏదైనా పదార్థానికి అలర్జీ ఉన్నవారు ముందుగా చిన్న భాగంలో పరీక్షించి, అవసరమైతే చర్మవ్యాధి నిపుణుల సలహాతో ఉపయోగించడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

వ్యాధుల కాలం.. జర పైలం

Updated Date - Jun 29 , 2026 | 05:44 PM