తెల్ల జుట్టు సమస్యకు కరివేపాకు-మెంతుల చిట్కా
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:20 PM
కరివేపాకు, మెంతులు, కలబంద వంటి సహజ పదార్థాలతో తయారుచేసిన హెయిర్ ప్యాక్ జుట్టుకు పోషణ అందించి, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ సింపుల్ హోం రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల జుట్టు సమస్య కనిపిస్తోంది. ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం వంటి కారణాల వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతోంది. దీంతో చాలామంది రసాయనాలతో కూడిన హెయిర్ డైలను ఉపయోగిస్తున్నారు. అయితే ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజంగా జుట్టు సంరక్షణ చేసుకోవాలనుకునే వారికి కరివేపాకు, మెంతులు మంచి ఇంటి చిట్కాగా ఉపయోగపడతాయి.
కరివేపాకును పురాతన కాలం నుంచే జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరచడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే మెంతుల్లో ఉండే ప్రొటీన్లు, ఖనిజాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
తయారీ విధానం
ముందుగా ఒక పాన్‌లో గుప్పెడు కరివేపాకు, రెండు చెంచాల మెంతులు వేసి తక్కువ మంటపై వేయించాలి. అవి బాగా వేగి గోధుమ రంగులోకి మారిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత వాటిని మెత్తగా పొడిచేసి నిల్వ చేసుకోవాలి.
ఎలా ఉపయోగించాలి?
తయారు చేసుకున్న కరివేపాకు-మెంతుల పొడిలో అవసరమైనంత కలబంద (అలోవెరా) జెల్ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమంగా రాసి 30 నుంచి 45 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ప్రయోజనాలు
ఈ మిశ్రమం జుట్టుకు సహజమైన మెరుపును అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పొడిబారకుండా కాపాడటంతో పాటు కుదుళ్లను బలపరుస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా, నిగనిగలాడేలా కనిపించేందుకు తోడ్పడుతుంది.
గమనిక: తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారుతుందని లేదా వెంటనే ఫలితం వస్తుందని శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ చిట్కా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. ఫలితాలు వ్యక్తులవారీగా మారవచ్చు.
Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు