చాణక్య నీతి: జీవితంలో అసలైన స్నేహితులు వీరే..
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:56 PM
మేకవన్నె పులుల బారినపడకుండా ఉండేందుకు చాణక్యనీతిలో కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అవేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో మిత్రులెవరో శత్రువులెవరో చెప్పడం కష్టం. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో తెలియక నిత్యం ఎంతో మంది సందిగ్ధావస్థను ఎదుర్కొంటూ ఉంటారు. మేకవన్నె పులులను నమ్మి బలైపోతుంటారు జీవన ప్రయాణంలో ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చెప్పిన చాణక్యుడు అసలైన మిత్రులను ఎలా గుర్తించాలో కూడా చెప్పాడు.
సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు..
ఉద్యోగం పోవడం, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వెన్నంటి ఉండేవారే అసలైన స్నేహితులని చాణక్యుడు చెప్పాడు. అంతా బాగున్నప్పుడు వెన్నంటి ఉంటూ కష్టాల్లో పడ్డామంటే ముఖం చాటేసే వాళ్లను జీవితంలో మరెన్నడూ దగ్గరకు రానీయకూడదు.
పోరాటంలో రక్షణగా..
మనం ఏదైనా వివాదంలో చిక్కుకున్నప్పుడు అండగా ఉండేవారు చాలా అరుదు. అలాంటి సమయాల్లోనూ వెన్నంటి నిలిచే వారే అసలైన స్నేహితులు. మీరు తప్పు చేస్తుంటే ఎత్తి చూపడానికి, తప్పు సరిదిద్దడానికి అసలైన స్నేహితులు వెనకాడరు. క్లిష్ట సమయాల్లో మార్గదర్శిగా కూడా నిలుస్తారు.
న్యాయవివాదాల్లో చుక్కానిగా..
జీవితంలో ఏదోక సందర్భంలో న్యాయవివాదాలు ఎదుర్కోక తప్పదు. ఇలాంటి సమయాల్లో మిత్రులు నైతిక మద్దతు ఇవ్వడమే కాకుండా సమస్య నుంచి బయట పడేందుకు తగిన సూచనలు సలహాలు ఇస్తారు. జీవితంలో ఇలాంటి వారిని అస్సలు వదులుకోవద్దనేది చాణక్యుడు చెప్పే నీతి.
స్నేహానికి అసలైన పరీక్ష..
మనకు డబ్బుకావాల్సినప్పుడు వెంటనే ఆదుకునే వాడే అసలైన స్నేహితుడు, ఆరాధ్యుడని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడే స్నేహితులు ఎవరో పరాయి వాళ్లు ఎవరో ఇట్టే తెలిసేది. నిజమైన స్నేహితులను గుర్తించేందుకు ఇదో అద్భుత అవకాశమని చాణక్య నీతి చెబుతోంది
సాయం చేసిన ప్రతివారినీ నమ్మొద్దు..
సాధారణంగా మనకు సాయం చేసిన వారిపై సదభిప్రాయం ఏర్పడుతుంది. అయితే, సాయం చేసిన ప్రతి వ్యక్తినీ మిత్రుడిగా భావించవద్దని చాణక్య నీతి చెబుతోంది. వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా చేతనైన మేరకు ఆదుకునే వారినే అసలైన స్నేహితులుగా భావించాలని చాణక్యుడు చెప్పాడు.
ఈ వార్తలనూ చదవండి:
బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చడం లేదా..? నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు తప్పవు!
అంతరిక్ష కేంద్రంలో అత్యంత అరుదైన పాస్‌పోర్ట్ స్టాంప్