Share News

వెనెజువెలాలో వరుస భూకంపాలు.. సంచలనం రేపుతున్న వీడియోలు..

ABN , Publish Date - Jun 25 , 2026 | 09:15 AM

వెనెజువెలాను బుధవారం నాడు వరుస భూకంపాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. భూకంపంతో అనేక భవనాలు నేలమట్టం కాగా.. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న అనేక వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

వెనెజువెలాలో వరుస భూకంపాలు.. సంచలనం రేపుతున్న వీడియోలు..

ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాను బుధవారం నాడు వరుస భూకంపాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. కరేబియన్ తీరంలోని మోరోన్ పట్టణానికి పశ్చిమాన 21 కిలోమీటర్ల దూరంలో 7.2 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. అదే పట్టణానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో క్షణాల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 10 వేల నుంచి లక్ష మంది వరకూ ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) అంచనా వేసింది. అలాగే వేల మంది ప్రజలు గాయపడి ఉండొచ్చని తెలిపింది. భూకంపాలతో అనేక భవనాలు నేలమట్టం కాగా, ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న అనేక వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.


మొదటి భూకంపం వచ్చినప్పుడు ఒక్కసారిగా పెద్దపెద్ద భవనాలు కూలిపోవడం ప్రారంభమయ్యాయి. అనేక చిన్నచిన్న ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఏం జరుగుతుందో గ్రహించి, ప్రాణరక్షణ కోసం ప్రజలు పరిగెత్తే లోపే అంతకంటే ఎక్కువ తీవ్రతతో రెండో భూకంపం వచ్చింది. దీంతో భారీ విధ్వంసం జరిగింది. కొన్ని భారీ భవనాలు కూలిపోగా, మరికొన్ని బిల్డింగులు ఊగిపోయాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు కూలిపోగా, శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో తమ ప్రాణాలను, కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.


మరోవైపు వెనెజువెలాలోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పు కూలిపోయింది. దీంతో విమానాశ్రయంలోని టెర్మినల్ మొత్తం దుమ్ముతో నిండిపోయింది. కొంతమంది ప్రయాణికులు తమ లగేజీ పట్టుకుని ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది లోపలే ఓ ఫుడ్ కౌంటర్ వద్ద ఆశ్రయం పొందారు. మొత్తం దుమ్ముతో నిండిపోతున్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడే ఉండిపోయారు.


తీరప్రాంత నగరమైన లా గువైరాకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. వరుస భూకంపాలతో కూలిపోయిన భవనాలు, గాలిలోని దుమ్ము, నిర్మానుష్యంగా మారిన రహదారులు ఆ వీడియోలో కనిపించాయి.


వెనెజువెలా రాజధాని కారకాస్‌లోనూ భారీ విధ్వంసం జరిగింది. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. స్థానికులు ప్రాణభయంతో కేకలు వేసిన దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయి.


మరో వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కల ప్రాణాలు కాపాడిన దృశ్యాలు కనిపించాయి. కూలిపోయిన తమ ఇంటి నుంచి అతి కష్టం మీద కుటుంబ సభ్యులను కాపాడుకున్నాడు బాధితుడు. ఆ తర్వాత తన రెండు కుక్కలనూ ప్రాణాలతో బయటకు తీసుకువచ్చాడు. ఇలాంటి అనేక వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి.


మరోవైపు జంట భూకంపాల అనంతరం వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో కూడా ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

జపాన్‌లో భూకంపం.. 6.9 తీవ్రతతో భూప్రకంపనలు..

ముగ్గురితో వివాహేతర సంబంధాలున్నాయి.. విచారణలో అంగీకరించిన బిల్‌గేట్స్..

Updated Date - Jun 25 , 2026 | 09:39 AM