Share News

షాకిచ్చిన యూఎస్.. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 09:01 AM

ఇరాన్‌ ముడి చమురు రంగంపై యూఎస్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. షమ్‌ఖానీ నెట్‌వర్క్‌కు చెందిన పలు సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలను కట్టడి చేసినట్టు యూఎస్ ట్రెజరీ తాజాగా ప్రకటించింది.

షాకిచ్చిన యూఎస్..  ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు
US sanctions Iran oil industry

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ ముడి చమురు రంగంపై అమెరికా మరిన్ని ఆంక్షలకు తెరతీసింది. హోర్ముజ్‌ జలసంధి విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో ఇరాన్‌ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఆంక్షలను కఠినతరం చేసింది. ఇరాన్‌ ఆయిల్ ఇండస్ట్రీకి చెందిన పలువురు కీలక వ్యక్తులు, కంపెనీలు, సరకు రవాణా నౌకలపై ఆంక్షలు విధించామని అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ బుధవారం ప్రకటించింది. ఆంక్షలను ఎదుర్కొంటున్న సంస్థలు, వ్యక్తులు ఇరాన్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త మొహమ్మద్ హుస్సేన్ షమ్‌ఖానీకి సంబంధించిన వారని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ ప్రజలను కష్టాల్లోకి నెట్టి ఆ కుటుంబం లాభపడుతోందని ఆరోపించారు.


హోర్ముజ్‌పై ఆంక్షలతో లాభపడుతున్న ఇరాన్‌ను కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా ట్రెజరీ విభాగం మరో ప్రకటనలో పేర్కొంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకి సలహాదారు, ఇరాన్ భద్రత వ్యవహారాల అధికారి అయిన అలీ షమ్‌ఖానీ కుమారుడే మొహమ్మద్ హుస్సేన్ షమ్‌ఖానీ. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్‌‌ దేశాలు చేసిన దాడిలో ఖమేనీతో పాటు అలీ షమ్‌ఖానీ కూడా మరణించారు.


షమ్‌ఖానీ నెట్‌వర్క్‌కు చెందిన సంస్థలు ఇరాన్‌తో పాటు యూఏఈలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అమెరికా చెబుతోంది. కన్సల్టెన్సీలు, షిప్పింగ్ సంస్థల సాయంతో షమ్‌ఖానీ నెట్‌వర్క్ తమ ఆంక్షల నుంచి తప్పించుకుంటోందని తెలిపింది. గతేడాది కూడా ఈ నెట్‌వర్క్‌కు చెందిన పలు సంస్థలపై యూఎస్ ఆంక్షలు విధించింది. ఇక ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాకు ఆర్థికసాయం అందించే ఇరానీ వ్యక్తి సయ్యర్ బద్రొద్దీన్ ముసావీపై కూడా ఆంక్షలు విధించామని అమెరికా వెల్లడించింది. ఇరాన్ ముడి చమురు విక్రయాల నగదుతో మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్న మరో మూడు సంస్థలపై కూడా ఆంక్షలు విధించామని తెలిపింది.

Updated Date - Apr 16 , 2026 | 10:52 AM