అమెరికా ఎన్నికల్లో నిధుల వరద.. చరిత్రలో తొలిసారిగా..
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:38 PM
అమెరికాలో ఈసారి మిడ్‌టర్మ్ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఈసారి మిడ్‌టర్మ్ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి. ఎన్నికల్లో నిధుల ఖర్చులను పరిశీలించే ఓపెన్ సీక్రెట్స్ సంస్థ ప్రకారం, ఈసారి ఎన్నికల్లో ప్రచార ఖర్చులు 12 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయి. అమెరికా రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చే సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీలు (సూపర్ ప్యాక్స్) ఎన్నికల్లో అత్యధికంగా నిధులు వెదజల్లుతున్నాయి.
టాప్‌లో ఎలాన్ మస్క్..
ఎన్నికల్లో విరాళాలు ఇచ్చిన వారిలో బిలియనీర్ ఎలాన్ మస్క్ తొలిస్థానంలో నిలిచారు. ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన 500 మిలియన్ డాలర్లు కేటాయించారు. ఈ మొత్తంలో అధికశాతాన్ని టెక్సాస్ ఎన్నికలకు కేటాయించారు.
అమెరికా చట్టాల ప్రకారం, ఎన్నికల్లో ఓ అభ్యర్థికి దాతలు, వారి పార్టీలు, సూపర్ ప్యాక్స్‌లు నేరుగా ఇచ్చే విరాళాలపై పరిమితులు ఉంటాయి. అయితే, సూపర్‌ప్యాక్స్ ఎంతటి మొత్తంలో అయినా విరాళాలు స్వీకరించవచ్చు. ఈ మొత్తాన్ని నేరుగా అభ్యర్థులకు ఇవ్వకపోయినా వారి తరఫున భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రతిపక్ష అభ్యర్థులకు వ్యతిరేకంగా నిర్వహించే ప్రచారాల్లోనూ భారీ ఎత్తున నిధులు కుమ్మరిస్తుంటాయి.
ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 15 నాటికి దాదాపు 9.5 బిలియన్ డాలర్ల నిధులు ఖర్చు అయ్యాయి. వీటిలో అధిక శాతం (5.5 బిలియన్ డాలర్లు) ప్యాక్స్, సూపర్ ప్యాక్స్ ఖర్చు చేశాయి. ఎన్నికలపై పెట్టే ఖర్చును ఆయా అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు, సూపర్ ప్యాక్స్ లాంటి సంస్థలు అక్కడి ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ డేటా ప్రకారం, బిలియనీర్ జార్జి సోరోస్ ఏర్పాటు చేసిన జియోసార్ కార్ప్, ఫండ్ ఫర్ పాలసీ రిఫార్మ్ వామపక్ష వాద వర్గాలకు 102 మిలియన్ డాలర్ల మేర విరాళాలు చెల్లించాయి. ఇక న్యూయార్క్ సిటీ మాజీ మేయర్, వ్యాపారవేత్త మైఖేల్ బ్లూమ్‌బర్గ్ కూడా 60 మిలియన్‌ల విరాళాలు ఇచ్చారు.
ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్లకు మద్దతుగా నిధులిస్తున్న వారిలో జెఫ్ యాస్, రిచర్డ్, ఎలిజబెత్ యూలిన్‌లు కూడా ఉన్నారు. వారు మొత్తం 100 మిలియన్‌ల వరకూ నిధులు అందించారు. అతిపెద్ద డోనర్ ఎలాన్ మస్క్ ఇచ్చిన నిధుల్లో అధిక శాతం టెక్సాస్ సెనేట్ రేసులో ఉన్న కెన్ ప్యాక్స్‌టన్‌కు మద్దతుగా ఖర్చు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
14 మందితో వెళ్తున్న నౌకపై ఒమన్‌లో దాడి.. భారతీయ నావికుడి మృతి
నేపాల్‌లో ఘోర ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఒకరి మృతి!