Share News

వాన్స్ రిక్తహస్తాలతో వెనక్కు వెళ్లారు.. ఇరాన్ ఎంబసీ కామెంట్

ABN , Publish Date - Apr 12 , 2026 | 10:14 AM

ఇరాన్‌తో డీల్ కుదరలేదన్న యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎంబసీ స్పందించింది. యుద్ధంలో సాధించలేనిది చర్చలతో సాధించాలని యూఎస్ భావిస్తుండటంతో చర్చలు విఫలమయ్యాయని పేర్కొంది.

వాన్స్ రిక్తహస్తాలతో వెనక్కు వెళ్లారు.. ఇరాన్ ఎంబసీ కామెంట్
US Iran talks collapse

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో డీల్ కుదరలేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో అన్న ఆందోళన పతాకస్థాయికి చేరుకుంది. ఇక వాన్స్ ప్రకటనపై ఇరాన్ ఎంబసీ కూడా ఘాటుగా స్పందించింది. యుద్ధంతో సాధించలేనిది మరో మార్గంలో సాధిద్దామని యూఎస్ భావించినందుకే చర్చలు విఫలమయ్యాయని చెప్పింది. చర్చలు ముగిశాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఘానాలోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. హోర్ముజ్ జలసంధి ఇప్పటికీ మూసే ఉండటంతో వాన్స్ రిక్త హస్తాలతో వెనుదిరిగారని కూడా వ్యాఖ్యానించింది.

‘అమెరికా వాళ్లు చాలా దూరం ప్రయాణించి ఇస్లామాబాద్‌కు వచ్చారు. 21 గంటల పాటు చర్చలు సాగాయి. యుద్ధంతో సాధించలేని వాటిని ఇక్కడ సాధిద్దామని అనుకున్నారు. ఇరాన్ మాత్రం స్పష్టంగా నో చెప్పింది. ఇక చర్చలు ముగిశాయి. హోర్ముజ్ ఇప్పటికీ మూసే ఉంది. వాన్స్ రిక్తహస్తాలతో వెనక్కు వెళ్లారు. పరువు కాపాడుకునేందుకు వాళ్లకు ఆప్షన్స్ ఏవీ మిగల్లేదు’ అని ఘానాలోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.


ఇరాన్‌తో డీల్ కుదరకపోవడంపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం (ఏప్రిల్ 12) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని హద్దులను తాము దాటబోమని అన్నారు. అణ్వాయుధాల అభివృద్ధిని చేపట్టబోమన్న హామీని ఇరాన్‌ నుంచి ఆశించినట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం ఇదేనని కూడా చెప్పారు. ఇస్లామాబాద్‌లో చర్చల అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే, శనివారం యూఎస్ యుద్ధ నౌకలు హోర్ముజ్‌ జలసంధిని దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హోర్ముజ్‌‌ మీదుగా రాకపోకలకు మార్గం సుగమం అయ్యేలా చేస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ప్రకటించిన కాసేపటికే ఈ వార్తలు వెలువడ్డాయి. ఇక వాన్స్ తాజా ప్రకటనకు ముందు కూడా అధ్యక్షుడు ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల ఫలితాలు తనకు అనవసరమని చెప్పారు. జలసంధిలోని మైన్స్‌ను తొలగిస్తామని తెలిపారు. ఇరాన్‌పై ఇప్పటికే విజయం సాధించామని అన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 10:44 AM