యూఎస్, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు?
ABN , Publish Date - Apr 14 , 2026 | 10:43 AM
మరో రెండు రోజుల్లో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం కాల్పుల విరమణ గడువు ముగిసే లోపే మళ్లీ చర్చలు ప్రారంభించాలని ఇరు వర్గాలు యోచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇరాన్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. ఇటీవల పాక్ వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు కూడా ఎటూ తేలకుండా ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు మరోసారి చర్చలకు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గురువారం రెండో విడత చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసేలోపే చర్చలు చేపట్టాలనే యోచనలో ఇరు దేశాలు ఉన్నట్టు సమాచారం.
చర్చలను ప్రారంభించేందుకు రెండు దేశాలు సుముఖంగా ఉన్నాయని అమెరికా అధికారులు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై యూఎస్, ఇరాన్‌లు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టు మధ్యవర్తి ఒకరు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని కూడా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక రెండో విడత చర్చలకు కూడా ఇస్లామాబాద్ వేదిక అయ్యే అవకాశం ఉంది. జెనీవాలో కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చర్చల వేదిక ఖరారైతే వచ్చే గురువారమే ఇరు వర్గాలు మరోసారి సమావేశం చేపట్టే అవకాశం ఉంది.
ఇక రెండో దఫా చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉందని ఇటీవల సీఎన్ఎన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అవతలి వర్గం తమను సంప్రదించిందని సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నారు. డీల్ కుదుర్చుకునేందుకు ఇరాన్ ప్రతినిధులు ఆసక్తి ప్రదర్శించారని పేర్కొన్నారు. అణు కార్యక్రమానికి ఇరాన్ స్వస్తి పలకడం, హోర్ముజ్ జలసంధి తెరవడంపై స్పష్టమైన హామీలు రాకపోవడంతో ‘ఇస్లామాబాద్ చర్చలు’ విఫలమయ్యాయని అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే.