బీ2 బాంబర్లు.. ఎఫ్-35 ఫైటర్లు.. లుకాస్ డ్రోన్లు..
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:07 AM
ఇరాన్‌పై దాడి కోసం అమెరికా తన అమ్ములపొదిలోని అత్యాధునిక, అత్యంత సమర్థవంతమైన ఆయుధాలను వినియోగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌక అయిన యూఎ్‌సఎస్ గెరాల్డ్ ఆర్......
ఇరాన్‌పై దాడికి అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తున్న అమెరికా
వాషింగ్టన్, మార్చి 2: ఇరాన్‌పై దాడి కోసం అమెరికా తన అమ్ములపొదిలోని అత్యాధునిక, అత్యంత సమర్థవంతమైన ఆయుధాలను వినియోగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌక అయిన యూఎ్‌సఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌తోపాటు యూఎ్‌సఎస్ అబ్రహం లింకన్ క్యారియర్‌నూ ఇరాన్‌కు సమీపంలో మోహరించింది. గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌకలో ఫైటర్లను వేగంగా, సమర్థవంతంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి వీలయ్యే అత్యాధునిక ‘ఎలకో్ట్ర మ్యాగ్నటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ (ఈమాల్స్)’ ఉండటం గమనార్హం. ఇక శత్రుదేశాల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా ఒక్కోటీ 900 కిలోలకుపైగా బరువుండే భారీ బాంబులను వేసే సామర్థ్యమున్న బీ2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రాలను అమెరికా ధ్వంసం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానమైన ఎఫ్-22 రాప్టర్లతోనూ దాడులు చేస్తోంది. తక్కువ ఖర్చుతో లక్ష్యాలను ఛేదించేలా ఇరాన్‌కు చెందిన షహీద్ ఆత్మాహుతి డ్రోన్ల తరహాలో అభివృద్ధి చేసిన లుకాస్ డ్రోన్లను కూడా అమెరికా వినియోగిస్తోంది. ఈ దాడిలో ఏయే ఆయుధాలు వినియోగిస్తున్నారనే వివరాలను అమెరికా సెంట్రల్ కమాండ్ తాజాగా వెల్లడించింది.
అమెరికా ఆయుధాలు
బీ-2 స్టెల్త్ బాంబర్లు; లుకాస్ డ్రోన్లు; పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు; థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు; ఎఫ్-18, ఎఫ్-16, ఎఫ్-22 ఫైటర్లు; ఏ-10 అటాక్ జెట్‌లు; ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్లు; ఈఏ-18జీ ఎలకా్ట్రనిక్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్; అవాక్స్ విమానాలు; ఎయిర్‌బార్న్ కమ్యూనికేషన్ రిలే విమానాలు; పీ-8 తీరప్రాంత గస్తీ ఎయిర్‌క్రాఫ్ట్; ఆర్‌సీ-135 రీకనేసన్స్ ఎయిర్‌క్రాఫ్ట్; ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు; ఎం-142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థలు; గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు; కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు; రీఫ్యూయలింగ్ ట్యాంకర్ ఎయిర్‌క్రా్‌ఫ్టలు; రీఫ్యూయలింగ్ షిప్‌లు; సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు; సీ-130 రవాణా విమానాలు- వీటితోపాటు బయటికి వెల్లడించలేని కొన్ని ప్రత్యేక ఆయుధాలను కూడా వినియోగించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
ఇరాన్ అమ్ములపొదిలో క్షిపణులు..
అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ తన క్షిపణులతో సమాధానం చెప్పాలని భావిస్తోంది. పశ్చిమాసియాలో అత్యంత వైవిధ్యమైన క్షిపణి వ్యవస్థలున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. శత్రుదేశాల భయంతో ఇరాన్.. భూగర్భంలో వందల మీటర్ల లోతున ‘మిసైల్ సిటీస్’ పేరుతో సొరంగాలు తవ్వి, అక్కడి నుంచి క్షిపణులు ప్రయోగించే ఏర్పాట్లు చేసుకుంది. నిరుడు 12 రోజులపాటు ఇరాన్‌పై దాడులు చేసిన ఇజ్రాయెల్ వాటిలో కొన్నింటిని ధ్వంసం చేసినా.. మెజారిటీ వ్యవస్థలు ఇప్పటికీ పనిచేస్తున్నాయని అంచనా. ఇరాన్ వద్ద 75 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడులు చేసే షార్ట్‌రేంజ్ మిసైళ్ల నుంచి.. 2000 నుంచి 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం తునాతునకలు చేసే ఖోరాంషహర్ క్షిపణుల దాకా పలు రకాల క్షిపణులున్నాయి. అందుకే ఇజ్రాయెల్, అమెరికాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇరాన్ క్షిపని కేంద్రాలను ధ్వంసం చేయడంపైనే దృష్టి సారిస్తున్నాయి.



