21 నౌకలను ఇరాన్‌కు తిప్పి పంపించాము : యూఎస్ సెంట్రల్ కమాండ్
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:36 PM
దిగ్బంధనం మొదలైన నాటి నుంచీ ఇప్పటివరకూ 21 నౌకలను ఇరాన్‌కు తిప్పి పంపించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ దిగ్బంధనం మొదలైన నాటి నుంచీ ఇప్పటివరకూ 21 నౌకలను తిప్పి పంపించినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ తాజాగా వెల్లడించింది. ఇరాన్ పోర్టుల నుంచి సరకు రవాణా నౌకల రాకపోకలకు చెక్ పెట్టేలా యూఎస్ యుద్ధ నౌకలు అక్కడి సముద్రజలాల్లో గస్తీ కాస్తున్న విషయం తెలిసిందే. గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు శాశ్వతంగా ముగింపు పడేలా ఈ నిర్ణయం తీసుకున్నామని యూఎస్ చెబుతోంది.
ఇక యూఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ అనే గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకతో అరేబియా సముద్ర జలాల్లో గస్తీ నిర్వహిస్తున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇరాన్ పోర్టులకు వెళ్లి వచ్చే నౌకలను అడ్డుకుంటున్నామని తెలిపింది. దిగ్బంధనం మొదలైన నాటి నుంచీ తమ సూచనల మేరకు ఇరాన్ పోర్టులకు నౌకలు తిరిగెళ్లాయని పేర్కొంది.
ఇరాన్‌ను తమ నావికాదళం దిగ్బంధించడంపై అంతకుముందే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరాన్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకూ దిగ్బంధనం కొనసాగుతుందని అన్నారు. హోర్ముజ్‌ను తెరిచామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ పోస్టు పెట్టారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబఫ్ ఘాటుగా స్పందించారు. హోర్ముజ్ జలసంధి తమ ఆధీనంలోనే ఉందని అన్నారు. తమ అనుమతుల మేరకు తాము సూచించిన రూట్‌లో నౌకల రాకపోకలు సాగుతాయని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లో భద్రతావ్యవహారాలను యూఎస్ సెంట్రల్ కమాండ్ పర్యవేక్షిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా భద్రతా వ్యవహారాల పర్యవేక్షణ కోసం అమెరికా మొత్తం 11 ఏకీకృత సెంట్రల్ కమాండ్స్‌ను ఏర్పాటు చేసుకుంది.