Share News

అమెరికా సైనిక స్థావరాలను తొలగించాల్సిందే.. యూఏఈలో మొదలైన చర్చ

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:51 PM

అమెరికా సైనిక స్థావరాల ఆవశ్యకతపై యూఏఈలో చర్చ మొదలైంది. తమ దేశానికి వాటి అవసరం ఇక లేదని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా సైనిక స్థావరాలను తొలగించాల్సిందే.. యూఏఈలో మొదలైన చర్చ
US military bases UAE

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో యూఏఈ, అమెరికా మధ్య ఎడం పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు అక్కడి విశ్లేషకులు. తమ దేశంలోని అమెరికా సైనిక స్థావరాలను తొలగించాలని ఇప్పటికే కొందరు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇవి తమకు ఇక ఎంతమాత్రం వ్యూహాత్మక లాభాన్ని చేకూర్చవని ప్రముఖ వ్యాఖ్యాత అబ్దుల్ ఖాలేఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.

‘యూఎస్ స్థావరాలను తొలగించేందుకు ఇదే మంచి సమయం. ఇవి మనకు భారంగా మారాయి. వీటి వల్ల ఎలాంటి వ్యూహాత్మక లాభమూ లేదు’ అని అబ్దుల్ ఖాలేఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. యూఏఈ స్వీయ రక్షణ చర్యలు చేపట్టగలదని ఇరాన్ యుద్ధం రుజువు చేసినట్టు ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశంలో యూఎస్ మిలిటరీ ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే, యూఎస్ నుంచి అత్యాధునిక ఆయుధ సంపత్తిని మాత్రం ఎప్పటిలాగానే తీసుకుంటామని అన్నారు.


అత్యాధునిక మిలిటరీ సామగ్రిని సమకూర్చుకోవడంపై యూఏఈ దృష్టి సారించాలని ఆయన సూచించారు. దేశీయ రక్షణ వ్యవస్థల బలోపేతానికి కృషి జరగాలని అన్నారు. జాతీయ భద్రతకు ఇదే మంచి ఉపాయమని అన్నారు.

యూఏఈలోని అనేక అమెరికా సైనిక స్థావరాలను తాము టార్గెట్ చేసినట్టు ఇరాన్ గతంలో ప్రకటించింది. ఇతర గల్ఫ్‌ దేశాల్లోని యూఎస్ స్థావరాలను టార్గెట్ చేశామని తెలిపింది. అయితే, ఇరాన్ మిసైళ్లను మార్గమధ్యంలోనే కూల్చేశామని యూఈఏ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే యూఎస్‌ఏ స్థావరాల తొలగింపుపై కూడా యూఏఈలో చర్చ జరుగుతోంది.

Updated Date - Apr 25 , 2026 | 10:40 PM