ఒక్క రోజులోఇరాన్‌ను అంతం చేస్తా
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:53 AM
ఎన్ని డెడ్‌లైన్‌లు విధించినా ఇరాన్ కాల్పుల విరమణకు ఒప్పుకోకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఆ దేశాన్ని ఒక్క రాత్రిలో ఆక్రమించుకోగలం.. ఆ పని నేటి రాత్రికే జరగొచ్చు
సంధికి ఒప్పుకోకపోవటం నిరాశపర్చింది.. భారీ మూల్యం తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఎంతమంది కమాండర్లను చంపినా మా స్థైర్యాన్ని దెబ్బతీయలేరు
మా సైనికులు మరింత పౌరుషంతో పోరాడుతారు: ఖమేనీ
శాశ్వత శాంతికి హామీ ఇస్తేనే కాల్పుల విరమణ అన్న ఇరాన్
పది షరతులతో పాకిస్థాన్ ద్వారా అమెరికాకు సంధి ప్రతిపాదన
చర్చలంటూనే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు
ఐఆర్‌జీసీ నిఘా విభాగాధిపతి సహా 25 మంది మృతి
ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు
వాషింగ్టన్/ టెహ్రాన్, ఏప్రిల్ 6: ఎన్ని డెడ్‌లైన్‌లు విధించినా ఇరాన్ కాల్పుల విరమణకు ఒప్పుకోకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ దిగిరాకపోతే ఒక్కరాత్రిలో ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోగలమని, ఒక్క రోజులో పూర్తిగా నాశనం చేయగలమని హెచ్చరించారు. ఆ పని మంగళవారం రాత్రే జరగొచ్చని అన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ నిరాకరించిన తర్వాత సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోవటం నన్ను నిరాశపర్చింది. ఇక ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్క రాత్రిలో ఇరాన్ మొత్తాన్ని ఆక్రమించుకోగలం.. నాశనం చేయగలం. ఆ పని రేపు (మంగళవారం) రాత్రికే జరగొచ్చు’ అని తెలిపారు. ఇరాన్‌లో తమ వైమానికదళం సైనికుడు చిక్కుకుపోయిన విషయాన్ని తన ప్రభుత్వంలోని ఒక ద్రోహి ఇరాన్‌కు తెలిపాడని, అతడిని అరెస్టు చేసి జైలుకు పంపుతామని ప్రకటించారు. ఇరాన్‌లో కూలిన ఎఫ్-15ఈ విమానం పైలట్ కోసం 21 విమానాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా, ఎయిర్‌మెన్ కోసం ఏకంగా 155 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్ విమానాలతో గాలింపు నిర్వహించినట్లు తెలిపారు. తమ విమానాలు శత్రువు చేతికి చిక్కకూడదనే రెండింటిని పేల్చివేసినట్లు చెప్పారు.
మా స్థైర్యాన్ని దెబ్బతీయలేరు
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ‘బెదిరింపులు, దాడులు, ఐఆర్‌జీసీ కమాండర్లను చంపటం ద్వారా మా సైనిక బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. మా సైనికులు మరింత పౌరుషంతో పోరాడుతారు. మానవత్వంపై జరుగుతున్న ఈ దాడులకు అమెరికా, దాని మిత్ర దేశాలు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కాగా, యుద్ధాన్ని ఆపేందుకు ఈజిప్టు, తుర్కియే, పాకిస్థాన్ రూపొందించిన రెండు దశల కాల్పుల విరమణ సంధి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. శాశ్వత శాంతికి హామీ ఇవ్వని ఎలాంటి సంధికి తాము అంగీకరించేది లేదని ఈజిప్టులో ఇరాన్ రాయబారి మొజ్తబా ఫిర్దౌసీ సోమవారం స్పష్టంచేశారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు పది షరతులతో కూడిన సంధి ప్రతిపాదనను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు చేరవేసినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ(ఇర్నా) తెలిపింది. తాత్కాలిక కాల్పుల విరమణ శత్రువు బలం పుంజుకునేందుకు అవకాశం ఇస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ భగే వ్యాఖ్యానించారు. అంతకుముందు ఈజిప్టు, తుర్కియే, పాక్ దౌత్యవేత్తలు రూపొందించిన రెండు దశల కాల్పుల విరమణ ప్రతిపాదనలను ఇరాన్‌కు, అమెరికాకు అందజేశాయి. హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలన్న ప్రతిపాదనతోపాటు 15అంశాలు ఇందులో ఉన్నాయి. మొదటి దశలో 45రోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణను ప్రతిపాదించారు.
ఐఆర్‌జీసీ నిఘా విభాగాధిపతి హతం
చర్చలంటూనే అమెరికా-ఇరాన్ పరస్పరం భీకర దాడులు చేసుకొంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధానితోపాటు బహరెస్తాన్ జిల్లాలో అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దళాలు క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఐఆర్‌జీసీ నిఘా విభాగం అధిపతి మాజిద్ ఖదేమీ, రహస్య దళం అధిపతి అస్గర్ బకేరీ సహా 25 మంది మర ణించారు. టెహ్రాన్‌లోని షరీఫ్ సాంకేతిక విశ్వవిద్యాలయంపై కూడా దాడి జరిగింది. ఇరాన్‌కు అత్యంత కీలకమైన సౌత్‌పార్స్ సహజవాయు క్షేత్రంలోని పెట్రోకెమికల్ ప్లాంటుపైనా బాంబు దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ కూడా ఖతార్, యూఏఈ, ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించింది.
భగ్గుమన్న చమురు ధరలు
చర్చలకు ఇరాన్ ఒప్పుకోవటానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు సోమవారం ముగియటంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. జూన్ నెల కాంట్రాక్టుకు సంబంధించి ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్‌చేంజ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సోమవారం 110.58 డాలర్లకు చేరింది. మే నెల కాంట్రాక్టుకు సంబంధించి పశ్చిమ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు ధర 111.90 డాలర్లకు పెరిగింది. ఆసియా దేశాల్లోని రిఫైనరీలకు సరఫరా చేసే తన లైట్ ముడి చమురు ధరను సౌదీ అరేబియా సోమవారం 19.50 డాలర్లు పెంచింది. దీంతో ఈ చమురు బ్యారెల్‌కు 109.12 డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌లో చిక్కుకుపోయిన తన ఎయిర్‌మెన్‌ను రక్షించేందుకు శనివారం రాత్రి అమెరికా చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్‌పై ఇరాన్ అనుమానాలు వ్యక్తంచే సింది. తన సైనికుడిని రక్షించుకొనే ఆపరేషన్ ముసుగులో తమ వద్ద ఉన్న యురే నియంను కొట్టేయాలని అమెరికా కుట్ర చేసిందని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి.
మళ్లీ తెరపైకి నేవీ సీల్ టీం 6
ఇరాన్‌లో అమెరికా వైమానిక దళ ఎయిర్‌మెన్‌ను రక్షించేందుకు ఆ దేశం చేపట్టిన ఆపరేషన్‌లో అత్యంత సుశిక్షితులైన నేవీ సీల్ టీం 6 సైనికులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. రహస్యంగా ఉండే ఈ దళం.. అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించటంలో పేరు పొందింది. 2011, మే 2న పాకిస్థాన్‌లోని అబొటాబాద్‌లో అల్ కాయిదా అధినేత ఒసామాబిన్ లాడెన్‌ను మట్టుబెట్టింది కూడా ఈ టీం సభ్యులే. సీల్ టీం 6 చేపట్టిన ఆపరేషన్లపై హాలీవుడ్‌లో సినిమాలు కూడా వచ్చాయి.
ట్రంప్... ప్లీజ్ మాట్లాడవా...
హోర్ముజ్ జలసంధి, యుద్ధ విరమణపై ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతుండటంపై ఇరాన్ సెటైర్లు వేసింది. పలు దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్‌మీడియా వేదికగా ట్రంప్‌ను ఎగతాలి చేశాయి. హోర్ముజ్ జలసంధిని తెరిపించాలని పలు దేశాలను ట్రంప్ అడుగుతున్నట్లు.. రూపొందించిన ఓ సందేశాన్ని దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ పోస్ట్ చేసింది. అందులో ‘హోర్ముజ్ జలసంధిని తెరవండి’ అని ట్రంప్ అడగ్గా.. ‘దానిని మూసివేశారా’ అని భారత్, పాక్.. ‘తెరిచే ఉంది.. ఇప్పుడు మేము అక్కడి నుంచే బయటకు వచ్చాం’ అని చైనా సమాధానమిస్తున్నట్లు ఉంది. ‘ట్రంప్.. ప్లీజ్ మాట్లాడవా..! బోర్ కొడుతోంది’ అని జింబాంబ్వేలోని ఎంబసీ సెటైర్ వేసింది. ‘హోర్ముజ్ జలసంధి తాళంచెవులు ఎక్కడో పోయాయి’ అని మరో ట్వీట్ చేసింది.