Share News

ఇరాన్‌పై అణుదాడి జరగనుందా? క్లారిటీ ఇచ్చిన శ్వేత సౌధం

ABN , Publish Date - Apr 07 , 2026 | 09:23 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు అణుదాడిని సూచిస్తున్నాయన్న వార్తలపై శ్వేత సౌధం తాజాగా స్పందించింది. వారి వాఖ్యలలో అలాంటి అర్థమేదీ లేదని స్పష్టం చేసింది.

ఇరాన్‌పై అణుదాడి జరగనుందా? క్లారిటీ ఇచ్చిన శ్వేత సౌధం
White House on Trump, Vance Comments

ఇంటర్నెట్ డెస్క్: నేటి రాత్రి ఇరాన్‌ నాగరికతను తుడిచిపెట్టేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ట్రంప్ వార్నింగ్ తరువాత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనలను మరింత పెంచాయి. ఇరాన్ దారికి రాకపోతే తాము ఇప్పటివరకూ వాడని సాధనాలను వాడాల్సి వస్తుందని జేడీ వాన్స్ హెచ్చరించారు. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌దే తుది నిర్ణయమని చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ట్రంప్ ఈ సాధనాలను వాడవచ్చని పేర్కొన్నారు. ఇక సోమవారం కూడా ట్రంప్ దాదాపు ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఒక్కరాత్రిలో యావత్ దేశాన్ని తుడిచిపెట్టేయవచ్చని చెప్పుకొచ్చారు. దీంతో, ఈ కామెంట్స్ అణుదాడికి సంకేతమా? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ట్రంప్ అణుదాడి విషయమై ఆలోచిస్తుండవచ్చన్న భయాలు ఆయన సన్నిహితుల్లో పెరుగుతున్నాయని అంతర్జాతీయ పత్రిక గార్డియన్ కూడా మంగళవారం ఒక కథనంలో ప్రచురించింది. ఈ విషయమై ప్రముఖ బ్రిటిష్ రచయిత, జర్నలిస్టు ఓవెన్ జోన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డొనాల్డ్ ట్రంప్ ఈ బెదిరింపులకు దిగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే విపత్తును తప్పించేందుకు ఆయనను తక్షణం అధ్యక్ష పదవి నుంచి తప్పించాలి. లేదా ఈ విపత్తు నుంచి మానవాళి ఎన్నటికీ కోలుకోలేదు’ అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఇలా మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో శ్వేత సౌధం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యల్లో ఇరాన్‌పై అణుదాడి సూచనలు ఏవీ లేవని స్పష్టం చేసింది. ఇలాంటి అర్థాలు తీసేవారందరూ జోకర్లని పేర్కొంది.

Updated Date - Apr 07 , 2026 | 10:10 PM