ఇరాన్‌పై దాడులు ఇప్పట్లో ఆగవు!
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:00 AM
ఇరాన్‌పై దాడులు ఇప్పట్లో ఆగేవి కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. నాలుగైదు వారాలపాటు కొనసాగుతాయన్నారు.
నాలుగైదు వారాలపాటు కొనసాగుతాయి
ఇరాన్ దాడులతో అరబ్ దేశాలకు ఆగ్రహం
అవి కూడా దాడులు చేస్తామంటున్నాయి: ట్రంప్
వాషింగ్టన్, మార్చి 2: ఇరాన్‌పై దాడులు ఇప్పట్లో ఆగేవి కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. నాలుగైదు వారాలపాటు కొనసాగుతాయన్నారు. ఇరాన్‌లో తమకు బలమైన లక్ష్యాలు ఉన్నాయని, వాటిని నాశనం చేసేవరకు వెనుదిరగబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ సోమవారం తన రిసార్ట్ నుంచి ‘న్యూయార్క్ టైమ్స్’తో టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్‌పై దాడులు మరిన్ని రోజులు కొనసాగించేందుకు తగినంత మంది బలగాలు, క్షిపణులు, ఆయుధ సామగ్రిని పెంటగాన్‌సిద్ధం ఉంచిందని తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ ఆయుధ సామగ్రిని నిల్వ ఉంచినట్లు పేర్కొన్నారు. ఇక ఈ యుద్ధంలో ఇప్పటివరకు ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందినట్లు ట్రంప్ ధ్రువీకరించారు. ఇది తాము ఊహించిందేనని, మరింత మంది ప్రాణత్యాగం చేయాల్సివస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. వెనెజువెలాలో తాము పక్కా ప్రణాళితో కూడిన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదన్న దానిపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ మిలిటరీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, అధికారులు అంతా ప్రజలకు లొంగిపోవాలని సూచించారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో ఆ దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయంలో తన వద్ద మూడు అవకాశాలున్నాయని ట్రంప్ తెలిపారు. అయితే ప్రస్తుతం వాటిని బయట పెట్టబోనని, ముందు తమ పనిని పూర్తి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు తాము గట్టిగా కొట్టడం కూడా ప్రారంభించలేదని, త్వరలోనే ‘బిగ్ వేవ్’ ఉంటుందని అన్నారు. అరబ్ దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడటంతో అవి ఆగ్రహంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అవి కూడా ఇరాన్‌పై దాడులు చేయాలని భావిస్తున్నాయని తెలిపారు. తనను చంపాలని ఖమేనీ రెండుసార్లు ప్రయత్నించారని, కానీ.. తానే ముందుగా ఆయన పనిపట్టానని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్‌తో జరుగుతున్నది ముగింపు లేని యుద్ధం కాదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. దీనిని ఇరాక్ యుద్ధంతో పోల్చవద్దన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు.