ఇరాన్ లీడర్ ఎన్నికలో నేను జోక్యం చేసుకోవాల్సిందే!
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:01 AM
ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు, కొత్త నేత ఎన్నికలో తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు....
ఖమేనీ కుమారుడు ముజ్తాబా బలహీనుడు
ఆయన నాయకత్వాన్ని నేను అంగీకరించను
అమెరికా ప్రమేయం లేకుండా ఇరాన్ కొత్త నేతను ఎన్నుకోవడం సమయాన్ని వృథా చేయడమే: ట్రంప్
వాషింగ్టన్, మార్చి 5: ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు, కొత్త నేత ఎన్నికలో తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గురువారం ఆక్సియో్‌సకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల్లో చనిపోయిన అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తాబా ఖమేనీ పేరు వినిపిస్తోందని, కానీ దానికి తాను అంగీకరించబోనని ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రమేయం లేకుండా ఇరాన్ కొత్త నాయకుడిని ఎంచుకోవడమంటే.. వారు సమయాన్ని పూర్తిగా వృధా చేసుకుంటున్నట్టేనని వ్యాఖ్యానించారు. ఖమేనీ కుమారుడు చాలా బలహీనుడని.. ఇరాన్‌లో శాంతి, సామరస్యాలను నెలకొల్పే నాయకుడే తమకు కావాలని పేర్కొన్నారు. ఆ దిశగా కొత్త నాయకుడి నియామకంలో తాను జోక్యం చేసుకోవాల్సిందేనని చెప్పారు. గత నాయకత్వం అనుసరించిన విధానాలను కొనసాగించే ఇరాన్ కొత్త నేతలు ఎవరైనా సరే తాను తిరస్కరిస్తానని స్పష్టం చేశారు. లేకుంటే వచ్చే ఐదేళ్లలో ఇరాన్‌కు అమెరికాతో మళ్లీ ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
2 వేల డ్రోన్లు ప్రయోగించిన ఇరాన్
ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఇప్పటివరకు 2 వేలకుపైగా ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిందని ఐఆర్‌జీసీ వర్గాలను ఉటంకిస్తూ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రచురించింది. అంటే సుమారు నాలుగు నిమిషాలకు ఒకటి చొప్పున రోజుకు 330 డ్రోన్లను ప్రయోగించిందని పేర్కొంది. కాగా, బహ్రెయిన్ ప్రభుత్వ చమురు రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడితో పేలుడు జరిగి, మంటలు చెలరేగాయి. మంటలను నియంత్రణలోకి తెచ్చామని తర్వాత బహ్రెయిన్ ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ప్రజల ఇళ్లు, ఆస్పత్రులు, వ్యాపార సంస్థలు సహా 3,600 పౌర ఆవాసాలు ధ్వంసమైనట్టు ఇరాన్ రెడ్ క్రిసెంట్ వెల్లడించింది.