Share News

జన్మతః పౌరసత్వంపై పరిమితులు.. ట్రంప్‌ ప్రయత్నాలకు మళ్లీ చెక్ పెట్టిన కోర్టు

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:26 AM

అమెరికాలో పుట్టిన వారికి లభించే జన్మతః పౌరసత్వంపై పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తున్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి చుక్కెదురైంది.

జన్మతః పౌరసత్వంపై పరిమితులు.. ట్రంప్‌ ప్రయత్నాలకు మళ్లీ చెక్ పెట్టిన కోర్టు
Court Stays Trump Orders on Birthright Citizenship

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో పుట్టిన వారికి లభించే జన్మతః పౌరసత్వంపై పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తున్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి చుక్కెదురైంది. ఈ అంశంపై ఆయన గతంలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను మేరీలాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు నిలుపుదల చేసింది. తమ పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాకు వచ్చి సంతానానికి జన్మనిచ్చే వారిని అడ్డుకునేందుకు ట్రంప్ ఆగస్టు 6న ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ తీరును (బర్త్ టూరిజం) అనుమతించేదే లేదని అప్పట్లో తేల్చి చెప్పారు.

కోర్టు మాత్రం ట్రంప్ తాజా ఆదేశాలను కూడా నిలుపుదల చేసింది. జన్మతః పౌరసత్వంపై అంతకుముందు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ అంశంపై పరిమితులు విధించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.


వరుసగా ఎదురుదెబ్బలు..

రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ట్రంప్ జన్మతః పౌరసత్వాన్ని టార్గెట్ చేశారు. అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న వారు, తాత్కాలిక ప్రాతిపదికన (ఉద్యోగ ఆధారిత, టూరిస్టు వీసాలు) అమెరికాలో ఉంటున్న వారికి సంతానం కలిగితే అమెరికా పౌరసత్వం రాదంటూ విస్తృత స్థాయి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు చెల్లవని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. దీంతో, అమెరికాలో పిల్లల్ని కనేందుకే వస్తున్న వారిని ట్రంప్ టార్గెట్ చేశారు. బర్త్‌ టూరిజంను అడ్డుకుంటామంటూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రయత్నాలకు కూడా కోర్టులో చుక్కెదురైంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, అమెరికాలో పుట్టే ప్రతిచిన్నారికి ఆటోమెటిక్‌గా పౌరసత్వం లభిస్తుంది. టూరిస్టు, ఉద్యోగ ఆధారిత వీసాలపై వచ్చే వారితో పాటు అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారికి జన్మించే పిల్లలు అక్కడి పౌరులు అవుతారు. విదేశీ దౌత్యవేత్తలు, శత్రుదేశాల వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్ జలసంధి పేరు మార్చేస్తే పోలా.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్

‘టైమ్స్ స్క్వేర్’లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి

Updated Date - Sep 03 , 2026 | 09:58 AM