ఇరాన్ ఎంతలే.. అనుకొని తప్పుడు లెక్కలేసిన ట్రంప్ సర్కార్
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:53 AM
ఇరాన్ సుప్రీం కమాండర్ అలీ ఖమేనీని హత్య చేసి సంబరపడ్డ ట్రంప్ సర్కార్‌కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 12: ఇరాన్ సుప్రీం కమాండర్ అలీ ఖమేనీని హత్య చేసి సంబరపడ్డ ట్రంప్ సర్కార్‌కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆఫా్ట్రల్ ఇరాన్ అనుకుని కదన రంగంలోకి దూకిన అమెరి కా.. ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలో అర్థంగాక తల పట్టుకుంటోంది. యుద్ధం ప్రారంభమై రెండు వారాలు వావస్తున్నా అది ఆగడం లేదు. ట్రంపు లెక్కలు ఎందుకు తప్పాయో వివరిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ప్రధానంగా అమెరికా చేసిన ఐదు వ్యూహాత్మక తప్పిదాలను ఎత్తిచూపింది.
ఇరాన్ భయపడిపోతుందని..
దాడులు చేస్తే ఇరాన్ వెంటనే లొంగిపోతుందని, కొద్దిగా ప్రతిస్పందన మాత్రమే ఉంటుందని అమెరికా తప్పుడు అంచనా వేసింది. అమెరికా, ఇజ్రాయెల్ చేసే భారీ దాడులకు ఇరాన్ భయపడిపోయి, వెనక్కి తగ్గిపోతుందని అమెరికా వ్యూహకర్తలు భావించారు. దానికి విరుద్ధంగా ఇరాన్ ఎదురుదాడికి దిగింది.
చమురు మార్కెట్ పతనం తాత్కాలికమే
చమురు మార్కెట్ పతనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం అమెరికా చేసిన మరో పెద్ద తప్పిదం. ఇరాన్‌పై దాడుల వల్ల చమురు మార్కెట్‌కు తాత్కాలికంగా అవాంతరాలు ఏర్పడతాయని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఆయిల్ ధరలు ఏదో కొద్దిగా పెరిగి మళ్లీ యథాస్థితికి వస్తాయని యుద్ధం ముందు కొంతమంది అధికారులు వాదించారు. కానీ ప్రస్తుత పరిస్థితి దానిని విరుద్ధంగా ఉంది. సరఫరాలో అవాంతరాల కారణంగా చమురు ధరలు పెరిగిపోయాయి. అమెరికాలో పెట్రోల్ ధరలు ఎగిసిపడ్డాయి. ప్రపంచంపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది.
‘హోర్ముజ్’ ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడం
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు ఉన్న పట్టును అమెరికా యంత్రాంగం తక్కువగా అంచనా వేసింది. ఆయిల్ షిప్పింగ్‌లో ఈ దారి అత్యంత కీలకమని తెలిసి కూడా తప్పులో కాలేసింది. ఈ సన్నని జలమార్గంగుండా ప్రపంచవ్యాప్తంగా 20ు చమురు రవాణా అవుతోంది. ట్యాంకర్లను లక్ష్యంగా చేస్తామని, జలమార్గాన్ని మూసేస్తామని ఇరాన్ హెచ్చరికలతో కంపెనీలు భయపడ్డాయి. దీంతో పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ పరిణామాలతో ప్రపంచ ఇంధన రంగానికి కష్టాలు పెరిగాయి.
పాలన మార్పుపై అతి నమ్మకం
భారీగా దాడులతో ఇరాన్ నాయకత్వం అస్థిరమవుతుందని కొంతమంది అమెరికా చట్ట సభ్యులు భావించారు. దీంతో అక్కడ పాలన మారిపోతుందని బలంగా నమ్మారు.అంతర్గత ఆందోళనలతో అయినా ప్రభుత్వం పడిపోతుందని నమ్మారు. కానీ ఇరాన్ రా జకీయ, సైనిక సంస్థలు అనుకున్నదానికంటే ఎక్కువగా ప్రతిస్పందించాయి. అలీ ఖమేనీ హత్య తర్వాత కూడా ఇరాన్ నాయకత్వం బలంగా నిలబడింది.
యుద్ధం ఆపే వ్యూహం లేదు
అమెరికా ప్రభుత్వం యుద్ధాన్ని ఎలా ప్రారంభించాలనే ఆలోచించింది తప్ప ఎలా ముగించాలని ఆలోచించలేదు అని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. విజయంపై అస్పష్ట నిర్వచనం, లక్ష్యాలు మారిపోవడంతో పాటు పరిమిత దాడుల నుంచి షరతులు లేకుండా లొంగిపోవడం వరకు.. ఏ ప్రకటనపైనా అమెరికా నిలకడగా లేదు. యుద్ధాన్ని ముగించేలా సమగ్ర రోడ్‌మ్యా్‌పను కూడా రూపొందించలేకపోతోంది. బయటపడే మార్గం చూడమని సలహాదారులు కూడా వైట్ హౌస్‌ను కోరారు. యుద్ధంపై ట్రంప్ వ్యూహాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని ఇది ఎప్పటికి ముగుస్తుందో స్పష్టత లేదని పలువురు మండిపడుతున్నారు. అయితే అమెరికా దళాల్లో మృతుల్లో సంఖ్య పెరిగితే యుద్ధం నిలిచిపోయే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.