Share News

హోర్ముజ్ దిగ్బంధనం వద్దు.. యూఎస్‌పై సౌదీ అరేబియా ఒత్తిడి!

ABN , Publish Date - Apr 14 , 2026 | 08:15 AM

హోర్ముజ్ జలసంధిని యూఎస్ దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలతో ఇరాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.

హోర్ముజ్ దిగ్బంధనం వద్దు.. యూఎస్‌పై సౌదీ అరేబియా ఒత్తిడి!
Saudi Pressing US to Remove Hormuz Blockade

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ పోర్టుల నుంచి నౌకలు రాకపోకలు సాగించకుండా హోర్ముజ్‌ జలసంధిని అమెరికా దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. దిగ్బంధనాన్ని తొలగించి మళ్లీ చర్చలు ప్రారంభించాలని అమెరికాపై ఒత్తిడి తెస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికా చర్యలతో ఇరాన్ మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని సౌదీ భావిస్తున్నట్టు సమాచారం. ఇతర సముద్ర మార్గాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉందని భావిస్తోంది.

యూఎస్‌, ఇరాన్ మధ్య చర్చలు ఎందుకు విఫలం అయ్యాయనే విషయంలో ఇప్పుడిప్పుడే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అణు శుద్ధి కార్యక్రమాన్ని ఐదేళ్ల పాటు నిలిపివేస్తామని ఇరాన్ ప్రతిపాదించగా అమెరికా తిరస్కరించినట్టు అల్ జజీరా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. కనీసం 20 ఏళ్ల పాటు ఎలాంటి అణు కార్యక్రమాలు చేపట్టబోమన్న హామీ కావాలని యూఎస్ కోరినట్టు తెలుస్తోంది.


ఫాక్స్ న్యూస్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్‌తో చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని అన్నారు. ‘వారు మాకు కొంత అనుకూలంగానే ఉన్నారు’ అని చెప్పారు. ఇరాన్ పాలక వర్గం నుంచి అనుమతులు రాక వారు తమతో డీల్ కుదుర్చుకోలేకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక నేడు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా రాయబారితో సమావేశం కానున్నారు. తమకు ఇరాన్‌తో ఉన్న దౌత్య సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇంధన వాణిజ్యానికి సంబంధించి ఇప్పటికే ఇరాన్‌తో ఉన్న అగ్రిమెంట్స్ విషయంలో వెనక్కు తగ్గబోమని చెప్పింది. గల్ఫ్ ప్రాంతంలో యథాప్రకారం చైనా నౌకలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‎పై 5.7 తీవ్రత నమోదు

హోర్ముజ్‌ బంద్‌!

Updated Date - Apr 14 , 2026 | 08:29 AM