ఎఫ్‌బీఐ చీఫ్ క్యాష్ పటేల్‌కు పదవీ గండం? మీడియాలో సంచలన కథనాలు
ABN , Publish Date - Apr 26 , 2026 | 09:24 PM
ఎఫ్‌బీఐ చీఫ్ క్యాష్ పటేల్‌కు పదవీ గండం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ చీఫ్, భారత సంతతి నేత క్యాష్ పటేల్‌కు పదవీ గండం ఉందన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. క్యాష్ పటేల్‌కు వ్యతిరేకంగా మీడియాలో అనేక కథనాలు రావడంతో అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. పటేల్ పదవిని కోల్పోవడం ఖాయమేనని, ఎప్పుడనేదే ప్రశ్న అని సంబంధిత వర్గాలు అన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్న నేతలు పలువురు ఇప్పటికే తమ పదవులను కోల్పోయారు. తదుపరి క్యాష్ పటేల్ వంతు అని సమాచారం. పటేల్‌తో పాటు వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ కూడా పదవి నుంచి తప్పుకోవాల్సిన రావచ్చని తెలుస్తోంది.
అమెరికా మీడియాలో ఇటీవల క్యాష్ పటేల్‌కు వ్యతిరేకంగా పలు కథనాలు వెలువడ్డాయి. పటేల్ మద్యం మత్తులో విధులు నిర్వర్తించినట్టు ఒక కథనం సంచలనం కలిగింది. అయితే, ఈ కథనంపై క్యాష్ పటేల్ కోర్టు కెక్కారు. 250 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ ఒక వార్తాసంస్థపై పరువు నష్టం దావావేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఎఫ్‌బీఐ వనరులను వాడుకున్నట్టు కూడా ఆయనపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు ఎఫ్‌బీఐని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో క్యాష్ పటేల్‌పై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అయితే, శ్వేత సౌధం మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. అమెరికా ప్రభుత్వ యంత్రాంగంలో క్యాష్ కీలక వ్యక్తి అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ మీడియాకు స్పష్టం చేశారు.