నాగరికతను అంతం చేస్తామన్న ట్రంప్.. గట్టి వార్నింగ్ ఇచ్చిన ఇరాన్
ABN , Publish Date - Apr 07 , 2026 | 07:09 PM
నేటి రాత్రి ఇరాన్ నాగరికత అంతమైపోతుందంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా, దాని మిత్రదేశాలపై ఎన్నడూ మర్చిపోలేని దెబ్బ పడుతుందని హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌పై ఇరాన్ అదే స్థాయిలో బదులిచ్చింది. అమెరికా, దాని మిత్రదేశాలను ప్రాచీన ఇరాన్ నాగరికత ఎన్నడూ మర్చిపోలేని విధంగా దెబ్బకొడుతుందని తీవ్రస్థాయిలో బదులిచ్చింది. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ ఓ పోస్టు పెట్టింది.
ట్రంప్ వ్యాఖ్యలకు తుర్కియేలోని ఇరాన్ ఎంబసీ మరింత ఘాటుగా బదులిచ్చింది. సైకో హెచ్చరికలను లెక్కచేయబోమని పేర్కొంది. చరిత్రలో ఎన్ని దాడులు జరిగినా ఇరాన్ నాగరికత ఇప్పటికీ నిలిచే ఉందని పేర్కొంది. ‘అలెగ్జాండర్ ఈ నాగరికతను తగలబెట్టాడు. మంగోలులు దోచుకున్నారు. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది. ఇరాన్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలానికే ఎదురు నిలిచిన ఇరాన్ నాగరికతను సైకో హెచ్చరికలు ముగించలేవు’ అని ఇరాన్ ఎంబసీ పేర్కొంది.
నేటి రాత్రి ఇరాన్ నాగరికత అంతమైపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ చరిత్రలో ఇవి అత్యంత ముఖ్యమైన క్షణాలని అన్నారు. 47 ఏళ్లుగా సాగిన అరాచకాలకు ముగింపు పడనుందని కూడా చెప్పారు. లేదా ఇరాన్ పాలకుల నుంచి మంచి నిర్ణయం వెలువడవచ్చని కూడా వ్యాఖ్యానించారు. దీంతో, ట్రంప్ మనసులో ఏముందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక ఇరాన్‌లో మౌలికవసతులను టార్గెట్ చేస్తామని ట్రంప్ పేర్కొనడంపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అభ్యంతరం చెప్పారు. పౌర వసతులపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అన్నారు. ప్రతిపాదిత కాల్పుల విరమణ తమకు అంగీకారం కాదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకాలని, మళ్లీ దాడులు జరగవన్న హామీ కావాలని పట్టుబడుతోంది.