ఇరాన్‌కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తాం.. యూఎస్ హెచ్చరిక
ABN , Publish Date - May 02 , 2026 | 09:40 PM
హోర్ముజ్‌ను దాటేందుకు ఇరాన్‌కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తామని వివిధ షిప్పింగ్ సంస్థలను అమెరికా తాజాగా హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్‌ను దాటేందుకు ఇరాన్‌కు టోల్ ఫీజులు చెల్లించే షిప్పింగ్ కంపెనీలు ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్ఏసీ) ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు, సంస్థలతో అమెరికా సంస్థలు లావాదేవీలు జరపడానికి ఇప్పటికే ఎలాంటి అనుమతు లేవని ఓఎఫ్‌ఏసీ పేర్కొంది. అయితే, ఇతర దేశాల షిప్పింగ్ సంస్థలు ఇరాన్‌కు టోల్ చెల్లిస్తే ఆంక్షల ప్రమాదం తప్పదని హెచ్చరించింది.
యుద్ధం ముగింపు దిశగా ఇరాన్ ప్రతిపాదనలు తనకు నచ్చలేదని ఇటీవలే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓఎఫ్ఏసీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అణ్వాయుధం ఇరాన్‌కు ఎప్పటికీ లభించని విధంగా డీల్ కుదిరితేనే యుద్ధం ముగిస్తామని యూఎస్ చెబుతోంది.
ఏప్రిల్ 8న అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే, హోర్ముజ్‌లో ట్రాఫిక్‌ను ఇరాన్ అడ్డుకుంటుంటనే ఇరాన్ పోర్టుల నుంచి నౌకల రాకపోకలను అమెరికా అడ్డుకుంటోంది. టోల్ వసూళ్లకు సంబంధించిన తొలి దశ ఆదాయం తమకు అందిందని ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్ రెజా హజీ బాబే గత నెలలో పేర్కొన్నారు. ఈ నిధులను కేంద్ర బ్యాంకుకు మళ్లించామని అన్నారు.