Share News

పీక్స్‌కు ఉద్రిక్తతలు.. యూఎస్‌తో అన్ని సంబంధాలనూ కట్ చేసుకున్న ఇరాన్!

ABN , Publish Date - Apr 07 , 2026 | 08:44 PM

ట్రంప్ వార్నింగ్ నడుమ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో అన్ని రకాల సంబంధాలను తమ ప్రభుత్వం కట్ చేసుకున్నట్టు ఇరాన్ అధికారి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పీక్స్‌కు ఉద్రిక్తతలు.. యూఎస్‌తో అన్ని సంబంధాలనూ కట్ చేసుకున్న ఇరాన్!
Iran US relations cut

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ నాగరికతను అంతం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో అన్ని సంబంధాలనూ తమ ప్రభుత్వం తెంచుకున్నట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తాజాగా ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. దౌత్యపరమైన సంబంధాలతో పాటు పరోక్ష చర్చలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టు వెల్లడించింది. అమెరికా, ఇరాన్‌‌ల మధ్య ఇకపై సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం ఉండదని పేర్కొంది. డీల్ కుదుర్చుకోవాలన్న ట్రంప్ హెచ్చరికల నడుమ అన్ని సంబంధాలను ఇరాన్ కట్ చేసినట్టు వార్తలు వెలువడంతో అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది.


ఇదిలా ఉంటే, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్టు కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ రోజు ముగిసేసరికి ఏదో ఒక డీల్ కుదరవచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కూడా అధికారి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికాల తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Apr 07 , 2026 | 09:00 PM