Share News

రాత్రి పూట సూర్యకాంతి విక్రయం..!!

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:56 AM

కాదేది వ్యాపారానికి అనర్హం అనే మాటను నిజం చేస్తూ.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌’ అనే అంతరిక్ష పరిశోధన రంగ స్టార్టప్‌ సంస్థ సూర్యకాంతిని విక్రయించేందుకు ప్రణాళికలు చేస్తోంది

రాత్రి పూట సూర్యకాంతి విక్రయం..!!
sunlight

  • అద్దాల సాయంతో కక్ష్య నుంచి భూమి మీదకి సూర్యకిరణాలు

  • హైదరాబాద్‌ ‘స్కైరూట్‌’తో కలిసిఅమెరికా సంస్థ ప్రణాళిక

  • రెండు విక్రమ్‌ రాకెట్లతో ఉపగ్రహాల ప్రయోగానికి ఒప్పందం

వాషింగ్టన్‌, అక్టోబరు 16: కాదేది వ్యాపారానికి అనర్హం అనే మాటను నిజం చేస్తూ.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌’ అనే అంతరిక్ష పరిశోధన రంగ స్టార్టప్‌ సంస్థ సూర్యకాంతిని విక్రయించేందుకు ప్రణాళికలు చేస్తోంది. అవును.. భూమిపై ఎంపిక చేసిన ప్రాంతాలకు రాత్రి వేళల్లో సూర్యకాంతిని విక్రయించాలని అనుకుంటోంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన రంగ సంస్థ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ సహకారంతో ఈ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం సూర్యకాంతిని ప్రతిబింబించే భారీ అద్దాలతో కూడిన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ అనుకుంటోంది. భూకక్ష్యలో తిరిగే ఈ ఉపగ్రహాల్లోని అద్దాల ద్వారా సూర్యకాంతిని నచ్చిన ప్రదేశంలో పడేలా చేస్తుంది. ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతంలో సూర్యకాంతిని ప్రసరింప చేయడమే లక్ష్యంగా ఆ సంస్థ ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగా స్కైరూట్‌కు చెందిన ‘విక్రమ్‌’ రాకెట్ల సాయంతో ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి రెండు విక్రమ్‌ రాకెట్‌ ప్రయోగాలకు రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌, స్కైరూట్‌ మధ్య ఒప్పందం కుదిరింది. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ సీఈవో పవన్‌ చందన ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం విక్రమ్‌-1 రాకెట్‌తో తొలి ప్రయోగం జరుగుతుంది. అనంతరం స్కైరూట్‌ ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న విక్రమ్‌-1యూ రాకెట్‌తో రెండో ప్రయోగం చేస్తారు.


అయితే, ఈ ప్రయోగాలు ఎప్పుడు చేస్తారు ? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రకృతి వైపరిత్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు రాత్రి వేళల్లో సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా అదనపు వెలుతురు అందించేందుకు ఈ సూర్యకాంతి ఉపయోగపడుతుందని రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ పేర్కొంటోంది. అలాగే, సౌర విద్యుత్‌ కేంద్రాలకు సూర్యకాంతి అందుబాటులో ఉండే సమయం పెరుగుతుందని పేర్కొంది. కాగా, 1993లో రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు 65 అడుగుల అద్దాన్ని కక్ష్యలోకి పంపి దాని ద్వారా సూర్యకాంతి పుంజాన్ని భూమి మీదికి పంపారు. జ్ఞామ్య పేరిట చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనప్పటికీ.. నిధుల కొరతతో ఆ తర్వాత ఆగిపోయింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఇక సహించేది లేదు.. రష్యా చమురు శుద్ధి కేంద్రంపై ఉక్రెయిన్ దాడి..

యెమెన్‌ అధ్యక్ష భవనంపై హౌతీల క్షిపణి దాడి.. ఐదుగురి మృతి, 16 మందికి గాయాలు

Updated Date - Oct 17 , 2026 | 05:03 AM