Share News

ఆ రెండు ఏఐ మోడల్స్‌ అమెరికన్లకే!

ABN , Publish Date - Jun 14 , 2026 | 03:54 AM

ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్‌ తన క్లాడ్‌ ప్లాట్‌ఫామ్‌లో కొత్తగా విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మైథోస్‌ తరగతి మోడళ్ల పైన అమెరికా ప్రభుత్వం ఆకస్మికంగా నియంత్రణలు విధించింది.

ఆ రెండు ఏఐ మోడల్స్‌ అమెరికన్లకే!

  • విదేశీయులకు వాటి యాక్సెస్‌ ఇవ్వొద్దు

  • మైథోస్‌ 5, ఫేబుల్‌ 5లపై ఆంథ్రోపిక్‌ సంస్థకు అమెరికా సర్కారు ఆదేశం

న్యూయార్క్‌, జూన్‌ 13: ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్‌ తన క్లాడ్‌ ప్లాట్‌ఫామ్‌లో కొత్తగా విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మైథోస్‌ తరగతి మోడళ్ల పైన అమెరికా ప్రభుత్వం ఆకస్మికంగా నియంత్రణలు విధించింది. ఈ తరగతిలోని ఫేబుల్‌ 5, మైథోస్‌ 5 వర్షన్లను అమెరికన్‌ పౌరులకు తప్ప మరే విదేశీయులకు-దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా-అందుబాటులో ఉంచరాదని అమెరికా వాణిజ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ వర్షన్లను ఆంథ్రోపిక్‌ ఈ నెల 9నే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మూడు రోజులు తిరగకముందే శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నిలిపేశారు. అయితే, ఉమ్మడి వ్యవస్థలో విదేశీయులను మాత్రమేఆపడం సాధ్యం కాకపోవడంతో ఆంథ్రోపిక్‌ తన ఉద్యోగులు సహా అమెరికన్లు, విదేశీయులందరికీ ప్రపంచవ్యాప్తంగా సేవలు నిలిపేసింది. ఓపస్‌ 4.8 సహా మిగతా మోడళ్లేవీ ప్రభావితం కాలేదు. మైథోస్‌ 5ను సైబర్‌ రక్షణ, ప్రభుత్వ సంస్థల కోసం, ఫేబుల్‌ 5 సామాన్య ప్రజల కోసం రూపొందించారు. అవి ఎంత శక్తివంతమైనవంటే వాటి ద్వారా అత్యంత భద్రమైన వ్యవస్థలను హ్యాకింగ్‌ కూడా చేయవచ్చు. అయితే, అలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టగానే క్లాడ్‌ సహకరించకుండా మైథోస్‌ నుంచి బలహీనమైన ఓపస్‌ 4.8కు వినియోగదారుడిని షిఫ్ట్‌ చేస్తుంది. కానీ, ఆంథ్రోపిక్‌ను మాయచేసి మైథోస్‌లోనే పని చేయించవచ్చు. దాన్ని జైల్‌ బ్రేక్‌ అంటారు. ఆంథ్రోపిక్‌ మైథోస్‌లో ఈ పరిస్థితి ఉందని పోటీ ఐటీ సంస్థలు అమెరికా ప్రభుత్వానికి నివేదించాయి. వాటి ఆధారంగా అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆంథ్రోపిక్‌ స్పందించింది. ప్రభుత్వం కనిపెట్టిన లోపం అంత ప్రమాదకరమైనదేమీ కాదని చెప్పింది. పోటీ సంస్థల అత్యుత్తమ వర్షన్లతోనూ హ్యాకింగ్‌కు పాల్పడవచ్చని, అక్కడ కూడా జైల్‌ బ్రేక్‌ చేయగలిగారని ప్రస్తావించింది. ఇదే సూత్రం వర్తింపజేస్తే వాటన్నింటినీ మూసేయాల్సి ఉంటుందని చెప్పింది. త్వరలోనే అమెరికా ప్రభుత్వానికి నచ్చజెప్పి ఈ రెండు సేవలను ప్రపంచమంతా అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఇతర దేశాల మీద పైచేయి సాధించే ఏఐ మోడళ్లను అమెరికా ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చుకుంటుందని తాజా ఉదంతం నిరూపించింది.


ప్రపంచీకరణ చచ్చిపోయింది: శ్రీధర్‌

ఏఐ మోడళ్లను నియంత్రించాలని, విదేశీయులకు అందుబాటులో లేకుండా చూడాలని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచమంతా చర్చకు దారితీసింది. తాజా వ్యవహారంపై భారతీయ ఐటీ ప్రముఖుడు జోహో సంస్థ మాజీ సీఈవో శ్రీధర్‌ వెంబూ స్పందించారు. ‘‘ప్రపంచీకరణ చచ్చిపోయింది’’’ అని వ్యాఖ్యానించారు. భారతదేశం తన సొంతదారిని వెతుక్కోవాలని చెప్పారు. టెక్నాలజీ ఆయుధంగా మారిపోయిందని, దేశసార్వభౌమాధికారం, భదత్ర పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడ్డాయని హెచ్చరించారు. భారతీయ సంస్థలు భారత్‌, చైనాల్లో ఉన్న చిన్నస్థాయు ఓపెన్‌ సోర్స్‌ మోడల్స్‌ను వాడుకోవాలని సూచించారు. మనకు అమ్మడానికే ఇష్టపడని వాడికి డబ్బులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు.

Updated Date - Jun 14 , 2026 | 03:54 AM