హెచ్1బీ, గ్రీన్‌కార్డ్ మరింత కఠినం
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:54 AM
తమ దేశంలోకి వలసదారుల రాకను నియంత్రిస్తున్న అమెరికా సర్కార్.. ఇప్పుడు మరిన్ని ఆంక్షలతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. హెచ్1బీ, స్టూడెంట్ వీసా, గ్రీన్‌కార్డు...
అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో భారీ మార్పులు
ఆగస్టు నుంచి కొత్త రూల్స్..
భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు కష్టాలే
న్యూఢిల్లీ, జూన్ 9: తమ దేశంలోకి వలసదారుల రాకను నియంత్రిస్తున్న అమెరికా సర్కార్.. ఇప్పుడు మరిన్ని ఆంక్షలతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. హెచ్1బీ, స్టూడెంట్ వీసా, గ్రీన్‌కార్డు ప్రాసె స్‌ను కఠినం చేస్తూ కొత్త రూల్స్ ప్రతిపాదించింది. దీంతో విదేశీ నిపుణులు, విద్యార్థులు, కంపెనీలకు కష్టాలు పెరగనున్నాయి. ముఖ్యంగా అమెరికాకు వలస వెళ్లే వారిలో ఎక్కువగా ఉండే భారతీయులకు ప్రతిపాదిత నిబంధనలు చిక్కులు తెచ్చిపెట్టనున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్), కార్మిక, విదేశాంగ శాఖల ఏకీకృత నియంత్రణ అజెండాలో భాగంగా ఆ నిబంధనలు తయారు చేశారు. ఇప్పటి వరకు అవి అమల్లోకి రాకపోయినా, వాటి ఉద్దేశం మాత్రం స్పష్టంగా వెల్లడైంది. ఆ నిబంధనలు అమలైతే, అర్హత ప్రమాణాలు కఠినమవుతాయి. అలాగే పేపర్ వర్క్ పెరుగుతుంది. విదేశీ ఉద్యోగులను తెచ్చుకునే కంపెనీలపై నిశిత పరిశీలన ఉంటుంది. వారి కి ఖర్చులు కూడా తలకుమించిన భారమవుతాయి. ఈ కొత్త నిబంధనల ప్రభావం ఎక్కువగా హెచ్1బీపై పడనుంది. ప్రస్తుతం ఈ వీసాపై ఏటా 85 వేల విదేశీ ఉద్యోగులను తీసుకొచ్చి అమెరికా కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఆగస్టు నెలలో డీహెచ్‌ఎస్ తీసుకొచ్చే ఓ కొత్త నిబంధన ద్వారా హెచ్1బీ ప్రోగ్రామ్‌లో మార్పులు రానున్నాయి. ప్రస్తు తం వర్సిటీలకు, పరిశోధన సంస్థలకు ఉన్న మినహాయింపులు ఇకపై పరిమితం అవుతాయి. థర్డ్ పార్టీ క్లయింట్ సైట్ల ద్వారా హెచ్1బీ వర్కర్లను నియమించుకునే కంపెనీలకు నిబంధనలు కూడా కఠినం కానున్నాయి. ఈ థర్డ్ పార్టీ ప్లేస్‌మెంట్ విధానాన్ని భారతీయ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తాయి. ఇకపై వీరు నియమించుకునే ఉద్యోగి ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాడని పేపర్లతో పాటు రుజువు చేయాల్సి ఉంటుంది.
గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్ మరింత ఖరీదు
హెచ్1బీ వీసాలు, ఉద్యోగ ఆధార గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్ ఫీజును పెంచాలని కార్మిక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న హెచ్1బీ, పీఈఆర్‌ఎమ్ లేబర్ సర్టిఫికేట్ ఉన్న వారి వేతన స్థాయిలను సవరించనుంది. ఈ ప్రతిపాదనతో ఎంట్రీ స్థాయి వేతనం 17 పర్సంటైల్ నుంచి 34 పర్సంటైల్‌కు పెరగనుంది. ఉన్నత స్థాయి వేతనాలు కూడా పెంచాల్సి ఉంటుంది. దీనివల్ల విదేశీ కార్మికులకు స్పాన్సర్ కంపెనీలు కనీస వేతనాలను భారీగా పెంచాల్సి వస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..