Share News

భయపెడుతున్న ఆకలి పులి!

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:53 AM

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కోట్లాదిమంది ప్రజలు ఆకలితో అల్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ ...

భయపెడుతున్న ఆకలి పులి!

  • యుద్ధం కారణంగా ఆహార సంక్షోభ ముప్పు

  • సుమారు 4.5 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం

  • ప్రమాదం అంచున అఫ్ఘాన్‌, సోమాలియా, శ్రీలంక

  • ‘ఐరాస’ అనుబంధ సంస్థ వెల్లడి

వాషింగ్టన్‌, జూన్‌ 6 : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కోట్లాదిమంది ప్రజలు ఆకలితో అల్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ (డబ్ల్యూఎఫ్‌పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ముడి చమురు ధరలు పెరిగిపోవడం, ఆహార ఉత్పత్తుల లభ్యత పడిపోవడం, హోర్ముజ్‌ జలసంధి వద్ద సంక్షోభం కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తాము అందిస్తున్న సేవలను కూడా కుదించుకోవాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేసింది. పోషణ కరువైన చిన్నారులను సైతం ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపింది. బ్యారెల్‌ ముడి చమురు ధర జూన్‌లో కూడా సుమారు వంద డాలర్ల వద్దే కొనసాగితే 4.5 కోట్లమంది ఆహార భద్రతకు దూరం అవుతారని మార్చిలో ఈ సంస్థ అంచనా వేసింది. అదే విషయాన్ని డబ్ల్యూఎఫ్‌పీ గుర్తుచేస్తూ.. తాము అంచనా వేసినట్టే జరుగుతోందని తెలిపింది. అఫ్ఘానిస్థాన్‌, సోమాలియా, శ్రీలంక వంటి దేశాల్లోని అత్యధిక కుటుంబాలను ఈ పరిస్థితి తీవ్రమైన ఆహార సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం ఉందని తెలిపింది. ముడి చమురు ధరలు అదుపు తప్పడంతోపాటు ఆహార ఉత్పత్తుల ధరలు ఈ దేశాల్లో భయపెట్టే స్థాయికి చేరుకున్నాయని తెలిపింది. హోర్ముజ్‌ జలసంధి సంక్షోభంతో వాణిజ్యం దెబ్బతిని, ప్రజల ఆదాయాలు పడిపోయాయని వివరించింది. ఫలితంగా ఈ ఏడాది సోమాలియాలో 65 లక్షల మంది, అఫ్ఘానిస్థాన్‌లో 1.74 కోట్లమంది క్షుద్బాధకు గురయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య మరింత పెరగొచ్చుని హెచ్చరించింది. నిధులు లేమితో ఈ ఏడాది 15 లక్షలమందికే సేవలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. సోమాలియాలో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేళ్ల కంటే తక్కువ వయసు చిన్నారులకు సరఫరా చేస్తున్న ఆహార నిల్వలు జూలై వరకే వస్తాయని తెలిపింది. అవసరమైన నిధులకు, వాస్తవ లభ్యతకు మధ్య 89 శాతం వ్యత్యాసం ఉన్నదని పేర్కొంది. ‘‘ఆహార నిల్వలు ఖాళీ అవుతున్నాయి. పంపిణీ చేయడానికి తిండిగింజలు లేవు. పోషణ కరువై బాధపడుతున్న చిన్నారులపై యుద్ధ ప్రభావం అధికంగా కనిపిస్తోంది’’ అని డబ్ల్యూఎఫ్‌పీ ఉన్నతాధికారి జీన్‌ మార్టిన్‌ బ్యూయెర్‌ తెలిపారు. హోర్ముజ్‌ దిగ్బంధనం కారణంగా ఆహార నిల్వలతో నిండిన సంస్థకు చెందిన నౌకలు ఒమన్‌లోని సలాలా పోర్టులో నిలిచిపోయాయన్నారు. ముడిచమురు ధరలు భగ్గుమనడంతో అఫ్ఘానిస్థాన్‌లో సహాయ రవాణా ఖర్చులు ఒక్కసారిగా ఐదురెట్లు పెరిగాయని డబ్ల్యూఎఫ్‌పీ వివరించింది.

Updated Date - Jun 07 , 2026 | 05:53 AM