కేవలం రోబోలతో రష్యా స్థావరాన్ని కైవసం చేసుకున్నాం: ఉక్రెయిన్ అధ్యక్షుడు
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:55 PM
కేవలం రోబోలు, ఇతర మానవరహిత వాహనాల సాయంతో ఒక రష్యా స్థావరాన్ని కైవసం చేసుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా సంచలన ప్రకటన చేశారు. రోబోలు, మానవరహిత వాహనాలను ఉపయోగించి రష్యా సైన్యానికి చెందిన ఒక స్థావరాన్ని కైవసం చేసుకున్నామని అన్నారు. తమ వ్యూహం దెబ్బకు శత్రుదేశ సైనికులు లొంగిపోయారని కూడా చెప్పారు. యుద్ధ క్షేత్రానికి సైనికులను పంపకుండానే ఈ ఆపరేషన్‌ను నిర్వహించామని అన్నారు. తమ సైనికులు రిమోట్‌గా డ్రోన్స్, ఇతర వాహనాలను నియంత్రిస్తూ రష్యా స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో సైనికులను కాపాడుకోవచ్చనేందుకు ఇది ఒక ఉదాహరణ అని అన్నారు.
గత మూడు నెలలుగా ఇలాంటి రోబోలతో సుమారు 22 వేలకు పైగా మిషన్స్ నిర్వహించామని తెలిపారు. రాటెల్, టెర్‌ఎమ్ఐటీ, ఇతర రోబోటిక్ వ్యవస్థలతో ఈ మిషన్స్ నిర్వహించామని తెలిపారు. ప్రమాదకర మిషన్లకు రోబోలు వెళితే ఎందరో మనుషుల ప్రాణాలు నిలుస్తాయని అన్నారు. అత్యంత విలువైన ప్రాణాలను టెక్నాలజీతో కాపాడుకుంటున్నామని అన్నారు. తాజా మిషన్‌కు సంబంధించి పలు ఫొటోలను కూడా పంచుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు?