అందమైన అమ్మాయిని పంపండి.. నేను పెళ్లి చేసుకుంటా..!
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:19 AM
ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి అసభ్యకరమైన, విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తుర్కియేకు ఆయన పెట్టిన రెండు డిమాండ్లలో ఒకదానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నేను పెళ్లి చేసుకుంటా
తుర్కియేకు ఉగాండా ఆర్మీ చీఫ్ కైనెరుగాబా హుకుం
అంకారా, ఏప్రిల్ 12: ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి అసభ్యకరమైన, విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తుర్కియేకు ఆయన పెట్టిన రెండు డిమాండ్లలో ఒకదానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్లకు వ్యతిరేక పోరులో భాగంగా దీర్ఘకాలంగా అందిస్తున్న సైనిక సేవలకుగానూ ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,300 కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాను పెళ్లి చేసుకునేందుకు, తనకు భార్యగా ఆ దేశంలోనే అత్యంత అందమైన అమ్మాయిని పంపించాలన్నారు. 30 రోజుల్లోగా తన డిమాండ్లకు అంగీకరించకుంటే దౌత్యపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ దేశంలోని తుర్కియే రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని, తమ గగనతంలో తుర్కియే ఎయిర్‌లైన్స్ విమానాలను నిలిపివేస్తామని, అన్ని దౌత్య సంబంధాలను వదులుకుంటామని హెచ్చరించారు. వెన్నుపోటు పొడిచే స్నేహితుడు ఎవరికి కావాలి? అంటూ కైనెరుగాబా వ్యాఖ్యానించారు. భద్రత దృష్ట్యా తుర్కియేకు ప్రయాణాలను ఆపేసుకోవాలని కూడా తమ దేశ పౌరులకు సూచించారు. అదే సమయంలో పవిత్ర భూమి రక్షణ కోసం ఇజ్రాయెల్‌కు లక్ష మంది ఉగాండా సైనికులను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సోమాలియాలో మౌలిక సదుపాయాల ఒప్పందాల నుంచి ఆ దేశ రాజధానిలో పోర్టులు, ఎయిర్‌పోర్టుల కార్యకలాపాల వరకు తుర్కియే పెద్దఎత్తున లాభాలు పొందుతోందని, అయితే ఇదే సమయంలో ఆఫ్రికన్ యూనియన్ మిషన్ల ద్వారా రెండు దశాబ్దాలుగా అక్కడ అల్‌ఖైదా అనుబంధ, ఇస్లామిక్ ఉగ్ర సంస్థ అల్-షబాద్ మిలిటెంట్లపై పోరులో ఉగాండా తీవ్ర భద్రతా భారం మోస్తోందని కైనెరుగాబా శనివారం తన ‘ఎక్స్’ ఖాతాలో పెట్టిన వరుస పోస్టుల్లో పేర్కొన్నారు. కాగా, కైనెరుగాబా డిమాండ్లపై తుర్కియే, సోమాలియాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
గతంలోనూ చిత్రవిచిత్ర డిమాండ్లు
కైనెరుగాబా ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు కావడం గమనార్హం. ఆయన ఇలాంటి విచిత్ర డిమాండ్లు చేయడం ఇదే తొలిసారి కాదు. 2022లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని వివాహం చేసుకుంటానని, ఆమెను తనకు అప్పగిస్తే.. బదులుగా 100 అంకోలే జాతి ఆవులను ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. కైనెరుగాబా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తండ్రి, అధ్యక్షుడు యోవేరి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తన తండ్రికి కాబోయే రాజకీయ వారసుడిగా భావిస్తున్న కైనెరుగాబా.. 2022లో కెన్యాపై తన సైన్యంతో కలిసి దండెత్తుతానని, రెండు వారాల్లో నైరోబీని స్వాధీనం చేసుకుంటామని ఓ బెదిరింపు ప్రకటన చేశారు. దీంతో అధ్యక్షుడు యోవేరి.. కైనెరుగాబాను రక్షణ దళాల అధిపతి పోస్టు నుంచి తాత్కాలికంగా తొలగించడంతో పాటు కెన్యాకు క్షమాపణలు చెప్పారు.