షరతుల యుద్ధం!
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:17 AM
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అంశంలో షరతుల ‘యుద్ధం’ మొదలైంది. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరుపక్షాలూ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వస్తున్నా...
15 షరతులు పెట్టిన ట్రంప్.. ప్రతిగా పలు డిమాండ్లు చేసిన ఇరాన్
కాల్పుల విరమణ దిశగా చర్చలకు యత్నాలు
అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్ రాయబారం
అణుశుద్ధి నిలిపివేత, హోర్ముజ్ తెరవడం సహా పలు షరతులు, ప్రతిపాదనలతో ట్రంప్ ప్రణాళిక
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ద్వారా ఇరాన్‌కు జాబితా
పశ్చిమాసియాలో అమెరికా స్థావరాల ఎత్తివేత, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేసిన ఇరాన్
హోర్ముజ్ దాటడానికి ఫీజు వసూలు ప్రతిపాదన
వాషింగ్టన్/దుబాయ్, మార్చి 25: పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అంశంలో షరతుల ‘యుద్ధం’ మొదలైంది. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరుపక్షాలూ సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వస్తున్నా... పరస్పర డిమాండ్లతో ప్రతిష్ఠంభన నెలకొంది. పాకిస్థాన్ రాయబారం, సౌదీ, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చల్లో భాగంగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు షరతులతో కూడిన 15 అంశాల ప్రణాళికను ప్రతిపాదించగా.. ఇరాన్ తమ డిమాండ్లను ముందు పెడుతోంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ద్వారా ట్రంప్ ప్రణాళిక ఇరాన్‌కు చేరినట్టు పాకిస్థానీ అధికారులను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. మరోవైపు ఇరాన్ షరతుల సమాచారాన్నీ అమెరికా బృందానికి చేరవేసినట్టు పేర్కొంది. ఇరువర్గాల షరతుల్లో కొన్ని అంశాలు పరస్పరం విభేదించేలా ఉండటంతో.. చర్చలు ఎలా సాగుతాయి, కాల్పుల విరమణ జరుగుతుందా, ఎవరు వెనక్కి తగ్గే అవకాశం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే అవకాశం ఉందని, అక్కడ కుదరకపోతే టర్కీలో జరగొచ్చని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఉపశమనం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలన్నీ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కేంద్రంగా జరుగుతున్నాయని పేర్కొంది. కాగా అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య పరిష్కారం కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు వివరించినట్టు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు. సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులు సరికాదని, పశ్చిమాసియాలో ఘర్షణలు వెంటనే నిలిచిపోవాలని కోరారు.
ట్రంప్ షరతుల్లో ప్రధానమైనవి ఇవీ..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తం 15 అంశాలతో కాల్పుల విరమణ ప్రతిపాదనలు చేసినట్టు న్యూయార్క్ టైమ్స్, అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థలు తెలిపాయి. అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం నుంచి హోర్ముజ్ తెరవడం దాకా కీలక అంశాలు అందులో ఉన్నట్టు వెల్లడించాయి.
విస్తృతస్థాయిలో చర్చలకోసం నెల రోజులపాటు కాల్పుల విరమణ
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని శాశ్వతంగా వదులుకోవడం
ఇరాన్‌లో అణుశుద్ధిని నిలిపివేయడం
ఇప్పటికే శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు అప్పగించడం
ఇరాన్‌లోని నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణుకేంద్రాలను ఐఏఈఏ ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేయడం
హోర్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచడం
పశ్చిమాసియాలోని పలుదేశాల్లో మిలీషియా కార్యకలాపాలు ఆపేయడం
వివిధ సాయుధ గ్రూపులకు మద్దతు నిలిపేయడం
బాలిస్టిక్ క్షిపణులు సంఖ్య, సామర్థ్యంపై నియంత్రణ
కేవలం స్వీయ రక్షణకే క్షిపణులను వినియోగించడం
పైన షరతులకు ఇరాన్ అంగీకరిస్తే.. ఆ దేశానికి ఇచ్చే హామీలనూ ట్రంప్ ప్రణాళికలో పేర్కొన్నారు.
ఇరాన్‌పై అన్ని రకాల ఆంక్షల ఎత్తివేత
ఇరాన్‌లో బుషెహర్ అణువిద్యుత్ ప్లాంటు సహా ఆ దేశ పౌర అణు కార్యక్రమానికి సహకారం
‘స్నాప్‌బ్యాక్’ ఆంక్షల విధానాన్ని ఎత్తివేయడం. ఒప్పందంలో ఇరాన్ ఏదైనా అంశాన్ని ఉల్లంఘిస్తే.. ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి గతంలో విధించిన ఆంక్షలు ఆటోమేటిగ్గా మళ్లీ వర్తించే విధానమే ‘స్నాప్‌బ్యాక్’.
ఇరాన్ చేస్తున్న డిమాండ్లు ఇవే..
అమెరికాతో ఎలాంటి చర్చలూ జరపడం లేదని ఇరాన్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నా.. అంతర్గతంగా చర్చల ప్రక్రియ కొనసాగుతోందని మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాల నుంచి సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ కూడా పలు డిమాండ్లను అమెరికా ముందు పెట్టిందని రక్షణశాఖ అధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ తదితర అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అవేమంటే..
ఇరాన్‌పై దాడులను వెంటనే పూర్తిస్థాయిలో నిలిపివేయడం
భవిష్యత్తులో ఇరాన్‌పై ఎలాంటి దాడులు చేయబోమన్న గ్యారెంటీ
దాడులతో ఇరాన్‌కు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లింపు
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని అధికారికంగా గుర్తించడం. ఈజిప్ట్‌లోని సూయజ్ కెనాల్ తరహాలో హోర్ముజ్ దాటే నౌకల నుంచి ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై నియంత్రణలకు నో
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాల మూసివేత
లెబనాన్‌లోని హిజ్బొల్లా మిలీషియాపై ఇజ్రాయెల్ దాడుల నిలిపివేత