U.S. President Trump: అమెరికా.. ఆ 3 దేశాలు!
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:38 AM
భారీగా చమురు వనరులున్న వెనెజువెలాలో చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని డ్రగ్స్ సరఫరా ఆరోపణలతో ఎత్తుకెళ్లిన అమెరికా.. మరో మూడు దేశాలనూ లక్ష్యంగా చేసుకుంది. డ్రగ్స్ అక్రమ రవాణా ఆపకపోతే..
కొలంబియా, మెక్సికో, క్యూబాలపై టార్గెట్ ఎందుకు?
వెనెజువెలా తరహాలో ఈ మూడు దేశాలపైనా చర్యలు చేపడతామని హెచ్చరించిన ట్రంప్
న్యూఢిల్లీ, జనవరి 6: భారీగా చమురు వనరులున్న వెనెజువెలాలో చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని డ్రగ్స్ సరఫరా ఆరోపణలతో ఎత్తుకెళ్లిన అమెరికా.. మరో మూడు దేశాలనూ లక్ష్యంగా చేసుకుంది. డ్రగ్స్ అక్రమ రవాణా ఆపకపోతే.. కొలంబియా, మెక్సికో, క్యూబా దేశాల పాలకులకూ ఇదే గతి పడుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు కూడా. డ్రగ్స్ మాట ఎలా ఉన్నా.. వెనెజువెలాలో చమురును చేజిక్కించుకోవడమే ట్రంప్ లక్ష్యమనేది అందరూ చెబుతున్నదే. మరి కొలంబియా, మెక్సికో, క్యూబాలకు ట్రంప్ హెచ్చరికల వెనుక అసలు కారణాలేంటి? ఆ దేశాలతో అమెరికాకు ఉన్న సమస్యలు, పరస్పర సంబంధాలు, ఇతర అంశాలు ఏమిటనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అమెరికా ఉద్దేశాల వెనుక డ్రగ్స్‌తోపాటు అక్రమ వలసలు, సిద్ధాంతాలు, సహజ వనరులు, ఆ ప్రాంతాలపై వ్యూహాత్మక ఆధిపత్యం వంటి అంశాలెన్నో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కొలంబియా.. బ్రిక్స్ వైపు మళ్లడం
కొలంబియా దేశానికి ప్రపంచ డ్రగ్స్ రాజధానిగా పేరుంది. ప్రపంచంలో అత్యధికంగా కొకైన్ తయారయ్యేది అక్కడే. కానీ ఈ దేశాన్ని ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడానికి వెనుక కారణాలు మాత్రం వేరే. నిజానికి మొదట్లో అమెరికాకు కొలంబియా మిత్రదేశంగా ఉంది. 2012లో ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది.
కొలంబియా వాణిజ్యంలో 34శాతం అమెరికాతోనే జరుగుతుంది. ఆ దేశంలో డ్రగ్స్ కట్టడి కోసం అమెరికా భారీగా ఆర్థిక సహాయం కూడా అందించింది. 2021 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో 16 లక్షల మంది కొలంబియన్లు వివిధ ఉద్యోగాలు, పనుల్లో ఉన్నారు. 2022లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలంబియాకు నాటోయేతర సన్నిహిత మిత్రదేశం హోదా కూడా ఇచ్చారు. కానీ కమ్యూనిస్టు భావాలున్న గుస్తావో పెట్రో కొలంబియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అమెరికాతో దూరం పెరగడం మొదలైంది. అమెరికా డ్రగ్స్ వ్యతిరేక విధానాల అమలుకు గుస్తావో పెట్రో నిరాకరించారు. అదే సమయంలో భారత్, రష్యా, చైనాల ఆధ్వర్యంలోని బ్రిక్స్ ప్లస్ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపారు. నాటోకు పోటీగా బ్రిక్స్ కూటమి తయారయ్యేలా ఉందంటూ అమెరికా ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతోంది. ఈ క్రమంలో కొలంబియాపై కన్నెర్ర చేసింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ట్రంప్ కొలంబియాకు ఆర్థిక సాయాన్ని నిలిపివేయడంతోపాటు సుంకాలనూ విధించారు. కరీబియన్ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలను మోహరించి, ఆధిపత్యాన్ని ప్రదర్శించడాన్ని కొలంబియా తప్పుబట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వెనెజువెలా తరహాలో చర్యలు చేపడతామనీ హెచ్చరించారు.
మెక్సికో.. వలసల సమస్య..
అమెరికా, మెక్సికో ఇరుగుపొరుగు దేశాలే. ఇరు దేశాల మధ్య 3,145 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఎప్పుడూ ఒడిదుడుకులే. కానీ 2020లో అమెరికా, మెక్సికో, కెనడాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో అమెరికాకు మెక్సికో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. 2023లో ఈ దేశాల మధ్య వాణిజ్యం రూ.72 లక్షల కోట్లు (799 బిలియన్ డాలర్లు) కావడం గమనార్హం. అయినా మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమ వలసలు, ప్రమాదకర ఫెంటానిల్ సహా డ్రగ్స్ అక్రమ రవాణా, అమెరికాలో నేరాలు చేసే క్రిమినల్ గ్యాంగ్‌లకు మెక్సికో స్థావరంగా ఉండటం వంటివి సమస్యాత్మకంగా మారాయి. ట్రంప్ అక్రమ వలసలు, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకని అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడ కట్టేపని కూడా మొదలుపెట్టారు. మెక్సికోపై సుంకాలు కూడా విధించారు. మెక్సికోలో డ్రగ్స్ ముఠాల స్థావరాలపై అమెరికా దళాలు దాడులకు దిగుతాయని ప్రకటించారు.
మొదటి నుంచీ క్యూబా శత్రుదేశమే!
కమ్యూనిస్టు దేశమైన క్యూబా సహజంగానే సిద్ధాంత పరంగా అమెరికాకు వైరి దేశం. సోవియట్ యూనియన్ కాలం నుంచీ రష్యాకు క్యూబా మిత్రదేశం. దానికితోడు చైనాలతోనూ సత్సంబంధాలు ఉండటంతో క్యూబాపై అమెరికా చాలా కాలం ఆంక్షలు కొనసాగించింది. ఎలాగైనా క్యూబాను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని ప్రయత్నించింది. క్యూబాపై ఉగ్రవాద దేశం ముద్రవేసింది. ఆ దేశ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోను పదవి నుంచి దింపేయడానికి పలుమార్లు ప్రయత్నించి, విఫలమైంది. 2018లో ట్రంప్ అధ్యక్షుడయ్యాక క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటించారు. వెనెజువెలా నుంచి వద్దన్నా చమురు కొంటోందంటూ ఆంక్షలను కఠినతరం చేశారు.