Share News

మూడు రోజులే టైం!

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:03 AM

మరో మూడు రోజుల్లో ఇరాన్‌ చర్చలకు వచ్చి తమతో ఒప్పందం చేసుకోకపోతే ఆ దేశంలోని చమురు పైప్‌లైన్లు పేలిపోతాయని...

మూడు రోజులే టైం!

  • ఆలోగా ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ చమురు పైప్‌లైన్లు పేలిపోతాయి.. డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌/ టెహ్రాన్‌, ఏప్రిల్‌ 27: మరో మూడు రోజుల్లో ఇరాన్‌ చర్చలకు వచ్చి తమతో ఒప్పందం చేసుకోకపోతే ఆ దేశంలోని చమురు పైప్‌లైన్లు పేలిపోతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ‘మేము ఆ దేశ పోర్టులను దిగ్బంధించి చమురు వాణిజ్యాన్ని ఆపేశాం. దీంతో ఇరాన్‌ చమురు కేంద్రాలు, పైప్‌లైన్లు ఇప్పుడు చమురుతో పూర్తిగా నిండాయి. వాటిల్లోకి ఇంకా చమురు చేరితే పైప్‌లైన్లు లోపలి నుంచి పేలిపోతాయి. ఈ పరిస్థితి రాకముందే ఇరాన్‌ చర్చలకు రావాలి’ అని సూచించారు. ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ ఉపాధ్యక్షుడు ఇస్ఫహానీ స్పందించారు. ‘అమెరికా మా చమురు పైప్‌లైన్లు పేలిపోయేలా చేస్తే... మేము ఆ దేశానికి మిత్రులైన గల్ఫ్‌దేశాల్లోని చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటాం. మా లెక్క వేరుగా ఉంటుంది. ఒకటికి నాలుగు సమానం. మాది ఒకటి పేలితే.. ఆ దేశాల్లో నాలుగు చొప్పున పేలిపోతాయి’ అని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్‌ సరికొత్త శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఈ ప్రణాళికను పాకిస్థాన్‌ పాలకులకు అందించినట్లు ఆక్సియోస్‌ వార్తా సంస్థ తెలిపింది. మొదటి దశలో అమెరికా యుద్ధాన్ని ముగించి మళ్లీ దాడులు చేయబోమని హామీ ఇవ్వాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. తమ పోర్టుల దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ డిమాండ్‌కు ఒప్పుకుంటే.. రెండో దశలో భాగంగా హోర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవటం, దాని నిర్వహణపై చర్చలకు సిద్ధమని పేర్కొంది. ఈ అంశంపై కూడా ఒప్పందం కుదిరితే.. మూడో దశలో తమ అణు కార్యక్రమంపై చర్చలకు ఒప్పుకుంటామని ఇరాన్‌ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఇందుకు అమెరికా సుముఖంగా లేనట్లు తెలిసింది. పోర్టుల దిగ్బంధనంతో ఇరాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోందని, ఇప్పుడు దానిని తొలగిస్తే ఆ దేశంపై తమ పట్టు సడలిపోతుందని ట్రంప్‌ భావిస్తున్నట్లు సమాచారం. తమ నౌకాదళం ఇరాన్‌కు చెందిన 38 నౌకలను అరేబియా సముద్రంలోకి రాకుండా ఆ దేశానికే తిప్పి పంపిందని అమెరికా సెంట్ర ల్‌ కమాండ్‌ సోమవారం ప్రకటించింది. కాగా, చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌పై ఇరాన్‌ విమర్శలు గుప్పించింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం పాక్‌ పాలకులకు లేదని, చర్చలకు పాక్‌ నమ్మదగిన మధ్యవర్తి కాదని ఇరాన్‌ జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్‌ అధికార ప్రతినిధి రెజాయీ ఆరోపించారు.


ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు అవమానాలు!

  • జర్మనీ చాన్స్‌లర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా వరుసగా అవమానాలు ఎదుర్కొంటోందని జర్మనీ చాన్స్‌లర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ అన్నారు. ఇరాన్‌దే పైచేయిగా ఉందని.. ఈ సంక్షోభం నుంచి బయటపడే స్పష్టమైన ప్రణాళిక అమెరికా వద్ద లేదని తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో, ఇరాక్‌లో ఇటువంటి బాధాకరమైన అనుభవాలున్నాయని ఫ్రెడరిక్‌ గుర్తు చేశారు. అమెరికాతో ఇరాన్‌ ప్రతినిధులు చాలా నైపుణ్యంతో చర్చలు జరుపుతున్నారని, ఊహించినదానికంటే కూడా వాళ్లు శక్తిమంతంగా కనిపిస్తున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 07:03 AM