Share News

కాసేపట్లో యుద్ధం.. ఆ దేశాలు చెబితే ఆపా!

ABN , Publish Date - May 20 , 2026 | 02:31 AM

ఇరాన్‌పై మళ్లీ యుద్ధం మొదలుపెట్టడానికి సన్నద్ధమయ్యామని, ఒక గంటలో దీనిపై నిర్ణయం తీసుకుంటామనగా యూఏఈ, ఖతార్‌, ఇతర దేశాల విజ్ఞప్తితో ఆగిపోయానని అమెరికా...

 కాసేపట్లో యుద్ధం.. ఆ దేశాలు చెబితే ఆపా!

  • ఇరాన్‌తో చర్చల్లో పురోగతి ఉందని సౌదీ, ఖతార్‌, యూఏఈ చెప్పాయి..కొంత సమయం కావాలని కోరాయి

  • లేకుంటే ఇప్పటికే దాడులు జరుగుతుండేవి: ట్రంప్‌

వాషింగ్టన్‌, మే 19: ఇరాన్‌పై మళ్లీ యుద్ధం మొదలుపెట్టడానికి సన్నద్ధమయ్యామని, ఒక గంటలో దీనిపై నిర్ణయం తీసుకుంటామనగా యూఏఈ, ఖతార్‌, ఇతర దేశాల విజ్ఞప్తితో ఆగిపోయానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తీవ్రస్థాయిలో దాడులు జరుగుతూ ఉండేవని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష నివాసం శ్వేతసౌధం వద్ద మీడియాతో ట్రంప్‌ మాట్లాడారు. ‘‘నేను దాడికి సిద్ధమయ్యానని తెలిసి మధ్యవర్తిత్వం వహిస్తున్న సౌదీ అరేబియా, ఖతార్‌, యూఏఈ, బహ్రెయిన్‌ ప్రతినిధులు నాకు కాల్‌ చేశారు. గత రెండు రోజులుగా ఇరాన్‌ నేతలతో చర్చల్లో మంచి పురోగతి వచ్చిందని చెప్పారు. మరో రెండు, మూడు రోజులు సమయమిస్తే.. అవి ఆమోదయోగ్య ఒప్పందానికి మార్గం వేయవచ్చని వివరించారు. అయినా వారికి కొంత సమయమే ఇచ్చా. ఏ క్షణమైనా పూర్తిస్థాయిలో దాడికి సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి, సైన్యాధికారులను ఇప్పటికే ఆదేశించా’’నని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్‌ ఒప్పందానికి రాకుంటే.. ఇక ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేనని, కానీ త్వరలోనే భారీ స్థాయిలో దాడులు చేపడతామని పేర్కొన్నారు. అయితే చర్చలు, ఒప్పందం అంశంలో ఇన్నాళ్లు కీలక మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్‌ పేరును ట్రంప్‌ ఏమాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.

Updated Date - May 20 , 2026 | 02:31 AM