తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం!
ABN , Publish Date - May 17 , 2026 | 05:11 AM
చైనా-తైవాన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తైవాన్ కోసం 15 వేల కిలోమీటర్లు వెళ్లి చైనాతో యుద్ధం చేయలేమని పేర్కొన్నారు.
15 వేల కిలోమీటర్లు వెళ్లి శక్తిమంతమైన దేశంతో తలపడలేం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
చైనా ఇచ్చిన బహుమతులను చెత్తబుట్టలో వేసి వెళ్లిన ట్రంప్ బృందం
వాటిని గూఢచర్యానికి చైనా వాడే ప్రమాదం ఉందనే ఈ చర్య
వాషింగ్టన్, మే 16: చైనా-తైవాన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తైవాన్ కోసం 15 వేల కిలోమీటర్లు వెళ్లి చైనాతో యుద్ధం చేయలేమని పేర్కొన్నారు. ఈ విషయంలో పరిస్థితులన్నీ చైనాకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. చైనాలో రెండురోజుల పర్యటన ముగించుకొని అమెరికా చేరుకొన్న ఆయన.. శుక్రవారం (స్థానిక కాలమానం) ఫాక్స్‌న్యూస్ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘తైవాన్ అంశం చాలా క్లిష్టమైనది. చైనా చాలా శక్తిమంతమై, పెద్ద దేశం. తైవాన్ చాలా చిన్న ద్వీపం. అది చైనాకు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మేము 15 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అదే అసలు సమస్య. ఒకదేశ స్వాతంత్య్రం కోసం 15 వేల కిలోమీటర్లు వెళ్లి ఒక శక్తిమంతమైన దేశంతో యుద్ధం చేయలేం. చైనా, తైనాన్‌లు సంయమనంతో వ్యవహరించాలి’ అని సూచించారు. చైనా పర్యటనలో ఆ దేశ నేతలతో తాను జరిపిన చర్చల్లో ఎక్కువ సమయం తైవాన్‌పైనే గడిచిందని తెలిపారు. అయితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరిపిన తర్వాత కూడా తైవాన్ విషయంలో అమెరికా వైఖరి ఏమీ మారలేదని ట్రంప్ పేర్కొన్నారు. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తైవాన్‌పై చైనా దాడి చేయకపోవచ్చు. నేను ఇక్కడ లేకపోతే.. దాడి జరగొచ్చు’ అని పేర్కొన్నారు. జిన్‌పింగ్‌తో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. ‘అమెరికా-చైనా గొప్ప దేశాలు (జీ-2)’ అని వ్యాఖ్యానించారు. గత అమెరికా అధ్యక్షుల తప్పుడు విధానాల వల్లే చిన్న ద్వీపమైన తైవాన్ నేడు చిప్‌ల తయారీకి హబ్‌గా మారిందని ట్రంప్ విమర్శించారు. అమెరికా చిప్‌ల పరిశ్రమను తైవాన్ దొంగిలించిందన్నారు.
చెత్తబుట్టలో చైనా బహుమతులు
రెండు రోజుల చైనా పర్యటనలో ట్రంప్‌కు ఆతిథ్య దేశం ఇచ్చిన బహుమతులన్నీ అక్కడే చెత్తబుట్టలో వేసి స్వదేశానికి వెళ్లారు. ట్రంప్‌తోపాటు ఆయన అనుచర గణానికి, ఆయనతోపాటు వెళ్లిన అమెరికా పారిశ్రామిక దిగ్గజాలకు చైనా అధికారులు అందించిన బహుమతులు, గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులన్నీ ట్రంప్ అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ వద్ద ఏర్పాటుచేసిన చెత్తబుట్టలో పడేసినట్లు న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థకు చెందిన వైట్‌హౌస్ ప్రతినిధి ఎమిలీ గూడిన్ తెలిపారు. ‘చైనా అధికారులు ఇచ్చిన ప్రతి వస్తువును అమెరికా సిబ్బంది మా నుంచి తీసేసుకున్నారు. విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం పక్కన ఉన్న చెత్తబుట్టలో వాటిని పడేశారు. ఆ వస్తువుల్లో చైనా గూఢచర్యం, హ్యాకింగ్‌కు సంబంధించిన డివైస్‍లు అమర్చి ఉంటుందన్న అనుమానంతోనే ఇలా చేశారు’ అని ఎమిలీ ట్వీట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఈసారి బహిరంగంగానే చైనా వస్తువులను చెత్తబుట్టలో వేసినట్లు తెలిపారు. మరోవైపు ట్రంప్ బృందం చైనాలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు వారి రెగ్యులర్ ఫోన్లను కాకుండా హ్యాకింగ్‌కు వీలు కాని బర్నర్ ఫోన్లను వాడారు.