Share News

రెజా పహ్లావీకి అధికారమిచ్చే ఆలోచన లేదు..

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:09 AM

ఇరాన్‌ మాజీ యువరాజు రెజా పహ్లావీకి ఇరాన్‌ ప్రభుత్వాన్ని అప్పగించే ఆలోచనేదీ తమకు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు ముగిశాక.. ప్రస్తుత ఇరాన్‌ ప్రభుత్వం నుంచే ఒకరికి బాధ్యతలు అప్పగించడమే మంచిదని పేర్కొన్నారు......

రెజా పహ్లావీకి అధికారమిచ్చే ఆలోచన లేదు..

న్యూఢిల్లీ, మార్చి 3: ఇరాన్‌ మాజీ యువరాజు రెజా పహ్లావీకి ఇరాన్‌ ప్రభుత్వాన్ని అప్పగించే ఆలోచనేదీ తమకు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు ముగిశాక.. ప్రస్తుత ఇరాన్‌ ప్రభుత్వం నుంచే ఒకరికి బాధ్యతలు అప్పగించడమే మంచిదని పేర్కొన్నారు. అయితే ఆ కొత్త నేత కూడా ఖమేనీ తరహాలో తప్పుగా వ్యవహరిస్తే పరిస్థితి మళ్లీ క్లిష్టంగా మారుతుందని వ్యాఖ్యానించారు. అధికారం అప్పగించాలని తాము భావించిన ఇరాన్‌ నేతలు దాడుల్లో మృతిచెందారని పేర్కొన్నారు. మంగళవారం వైట్‌హౌజ్‌లో జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై దాడి కోసం స్పెయిన్‌ ఎయిర్‌బే్‌సలను వినియోగించుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం అంగీకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కావాలనుకుంటే.. నేరుగా ఆ ఎయిర్‌బే్‌సలలోకి వెళ్లగలమని, కానీ అలా చేయలేదని చెప్పారు. స్పెయిన్‌ తీరు దారుణమని, ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్‌పై దాడి కోసం ఇజ్రాయెల్‌ మీపై ఒత్తిడి తెచ్చిందా అని మీడియా ప్రశ్నించగా.. ‘కాదు.. నేనే ఇజ్రాయెల్‌ను ముందుకు తోసి ఉండవచ్చు’ అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. కనీసం పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, దౌత్య సిబ్బందిని బయటికి తరలించే ప్రణాళిక కూడా సిద్ధం చేయకుండా యుద్ధం ఎలా ప్రారంభించారని ప్రశ్నించగా.. దీనిపై అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Updated Date - Mar 04 , 2026 | 04:09 AM