Share News

యుద్ధానికి 5 రోజులు విరామం

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:57 AM

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇరాన్‌తో గత రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయని..

యుద్ధానికి 5 రోజులు విరామం

  • ఇరాన్‌పై దాడులు చేయొద్దని ఆదేశాలిచ్చా

  • ఆ దేశంతో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి

  • వారాంతం వరకు అవి కొనసాగుతాయి

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

  • హోర్ముజ్‌ జలసంధిని అమెరికా, ఇరాన్‌ కలిసి నిర్వహించే అవకాశముందని వెల్లడి

  • అమెరికాతో ఎలాంటి చర్చలు జరగటం లేదు

  • మా హెచ్చరికలకు భయపడే ట్రంప్‌ తగ్గారు: ఇరాన్‌

  • దాడులకు విరామం ప్రకటించిన రోజే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ బాంబులు

  • అమెరికా స్థావరాలకు రూ.7,500 కోట్ల నష్టం

  • పశ్చిమాసియాలో ఆస్తులపై ఇరాన్‌ దాడుల ఫలితం

  • యూఎస్‌ మిలిటరీకి చెందిన 13 మంది మృతి

  • యుద్ధం తొలి 6 రోజుల్లో లక్ష కోట్ల ఖర్చు: సీఎస్‌ఐఎస్‌

  • అమెరికాలో 40 శాతం పెరిగిన పెట్రోలు ధర

వాషింగ్టన్‌, మార్చి 23: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇరాన్‌తో గత రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయని.. అందువల్ల వచ్చే 5 రోజులపాటు ఆ దేశంపై దాడులు చేయవద్దని తన బలగాలకు ఆదేశాలిచ్చినట్లు సోమవారం సోషల్‌మీడియా ద్వారా ప్రక టించారు. ‘మధ్య ఆసియాలో శత్రుత్వానికి పూర్తిగా పరిష్కారం కనుగొనేందుకు అమెరికా, ఇరాన్‌ మధ్య రెండు రోజులుగా నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయి. వారంపాటు ఈ చర్చలు విస్తృతంగా కొనసాగేందుకు వీలుగా ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలపై వచ్చే 5 రోజులపాటు ఎలాంటి దాడులు చేయరాదని యుద్ధ శాఖను ఆదేశించా. చర్చలు విజయవంతం కావటానికే ఈ ఆదేశాలు ఇచ్చాను’ అని ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు.


48 గంటల్లోగా హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవకుంటే ఇరాన్‌లోని విద్యుత్‌ మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించిన 24 గంటల్లోనే ట్రంప్‌ యుద్ధ విరామ ప్రకటన చేయటం గమనార్హం. కాగా, త్వరలోనే ఇరాన్‌తో కీలక ఒప్పందం కుదురుతుందని ట్రంప్‌ తెలిపారు. యుద్ధ విరామ ప్రకటన చేసిన తర్వాత ఆయన సోమవారం ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో హోర్ముజ్‌ జలసంధిని ఎవరు నిర్వహిస్తారన్న ప్రశ్నకు.. ‘నేనే కావచ్చు.. అయతొల్లా, నేను కలిసి నిర్వహించవచ్చు’ అని బదులిచ్చారు. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన వెంటనే చమురు ధరలు అమాంతం దిగి వస్తాయని చెప్పారు. ప్రస్తుత ఘర్షణకు ముగింపు పలికేందుకు ఇటీవల జరిగిన చర్చల్లో ఇరాన్‌తో కీలక ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ‘ఇరాన్‌లోని మూడు స్థాయిలు నాయకత్వాన్ని మేము తుదముట్టించాం. అయితే, ఆ దేశంలో ప్రస్తుతం అత్యంత గౌరవనీయుడైన వ్యక్తితో చర్చలు జరుపుతున్నాం. ఇరాన్‌ ఇకపై యురేనియం శుద్ధి చేపట్టరాదని, అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేయాలని మేము కోరుకుంటున్నాం. అదే సమయంలో ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియంను కూడా మాకు అప్పగించాలని కోరుతున్నాం. చర్చల్లో వైట్‌హౌస్‌ మధ్య ఆసియా రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌, నా అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ పాల్గొంటున్నారు’ అని ట్రంప్‌ తెలిపారు.

చర్చలే జరగటం లేదు: ఇరాన్‌

ట్రంప్‌ ప్రకటనను ఇరాన్‌ ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగటం లేదని ఆదేశ అధికారులను ఉటంకిస్తూ ఇరాన్‌ మీడియా సంస్థ టాస్మిన్‌ న్యూస్‌ సోమవారం ప్రకటించింది. భయంతోనే ట్రంప్‌ వెనక్కు తగ్గారని ఎద్దేవా చేసింది. ఇరాన్‌ విద్యుత్‌ సంస్థలపై దాడులు చేస్తామన్న ట్రంప్‌ హెచ్చరికలకు ఇరాన్‌ గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. తమ విద్యుత్‌ కేంద్రాలపై దాడులు జరిగితే పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్‌ (ఐఆర్‌జీసీ) ఆదివారం హెచ్చరించింది. ఈ హెచ్చరికతోనే ట్రంప్‌ వెనక్కు తగ్గారని కాబూల్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమ దక్షిణ తీర ప్రాంతంలోని దీవులపై అమెరికాగానీ ఇజ్రాయెల్‌గానీ దాడులు చేసినా, ఆక్రమించుకోవాలని ప్రయత్నించినా.. పర్షియన్‌ గల్ఫ్‌ మొత్తం నీటిలో మందుపాతరలు పరుస్తామని ఇరాన్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ హెచ్చరించింది. తమ శత్రువులకు తప్ప హోర్ముజ్‌ జలసంధి ఇతర అన్ని దేశాలకు పూర్తిగా తెరుస్తామని మరోసారి ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర రవాణా పర్యవేక్షణ సంస్థ (ఐఎంవో)తో పూర్తిగా సహకరిస్తామని ఆ సంస్థలో ఇరాన్‌ శాశ్వత ప్రతినిధి అలీ మౌసవీ తెలిపారు. అయితే, హోర్ముజ్‌ జలసంధిలో యుద్ధానికి ముందు నాటి పరిస్థితులు మాత్రం ఇకపై ఉండవని స్పష్టంచేశారు.


హోర్ముజ్‌లో ‘ఘోస్ట్‌’ ట్యాంకర్లు!

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ నడుమ భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో ‘ఘోస్ట్‌’ నౌకల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఏనాడో డీకమిషన్‌ చేసి.. సేవల నుంచి తొలగించడమే గాక.. ధ్వంసం కూడా అయ్యాయంటున్న ‘జోంబీ నౌకలు’.. చమురు లోడ్లతో హోర్ముజ్‌ జలసంధి వద్ద తాజాగా ప్రత్యక్షమవుతున్నాయి. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి కొన్ని మారిటైం సంస్థలు ఇలాంటి తీసేసిన జోంబీ నౌకల పేర్లు, అంతర్జాతీయ మారిటైం సంస్థ (ఐఎంవో) నంబర్లు, జెండాలను అక్రమంగా పొంది.. రంగంలోకి దించుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం హోర్ముజ్‌లో నబీన్‌ అనే జోంబీ నౌక కనిపించింది. సోమవారం ఉదయానికి అది గల్ఫ్‌ ఆఫ్‌ ఒమాన్‌లో ప్రత్యక్షమైంది. ఐతే, ఐదేళ్ల కింద దీనిని డీకమిషన్‌ చేశారని రికార్డుల్లో నమోదై ఉంది. గతేడాది భారత్‌ షిప్‌యార్డుల్లో ధ్వంసమైందంటున్న జమాల్‌ అనేక ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్‌ కూడా గత శుక్రవారం హోర్ముజ్‌ను దాటడం గమనార్హం.

టెహ్రాన్‌పై కొనసాగిన దాడులు

ఒకవైపు దాడులను ఆపేస్తున్నామని ట్రంప్‌ ప్రకటించగా, అదే సమయంలో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలోకి అమెరికా మరో 4,500 మంది మెరైన్‌ సైనికులను తరలించినట్లు తెలిసింది. ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఖార్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అమెరికా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇరాన్‌ ఆత్మాహుతి డ్రోన్ల మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

3 దేశాల రాయబారం!

ఇరాన్‌-అమెరికా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈజిప్టు, తుర్కియే, పాకిస్థాన్‌ రాయబారం మొదలుపెట్టినట్లు సమాచారం. అమెరికా, ఇరాన్‌ మధ్య పరోక్ష చర్చలకు ఈ మూడు దేశాల ప్రతినిధులు వేర్వేరుగా మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఆక్సియోస్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఈ దేశాల ప్రతినిధులు ఇటు స్టీవ్‌ విట్‌కాఫ్‌తోనూ, అటు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీతోనూ చర్చిస్తూ.. ఒకరి సందేశాన్ని మరొకరికి చేరవేస్తున్నారని తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని కొందరు ఇరాన్‌ అధికారులు కూడా కొందరు ధ్రువీకరించారు. అయితే, ఇరాన్‌ అధికార వార్తా సంస్థ ఫార్స్‌ న్యూస్‌ మాత్రం చర్చల వార్తలను ఖండించింది. అమెరికాతో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ చర్చలు జరగటం లేదని సోమవారం స్పష్టంచేసింది.

Updated Date - Mar 24 , 2026 | 06:23 AM