యుద్ధంపై ట్రంప్ కుప్పిగంతులు!
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:52 AM
ఇరాన్‌పై యుద్ధం ముగింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూటకోమాట మాట్లాడుతున్నారు. యుద్ధం ఆపేస్తున్నట్టు ఒకసారి, సుదీర్ఘకాలం కొనసాగుతుందని మరోసారి...
నేడు ఉదయం ట్రంప్ మీడియా సమావేశం.. యుద్ధంపై కీలక ప్రకటన చేస్తారన్న వైట్‌హౌజ్
వాషింగ్టన్, ఏప్రిల్ 1: ఇరాన్‌పై యుద్ధం ముగింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూటకోమాట మాట్లాడుతున్నారు. యుద్ధం ఆపేస్తున్నట్టు ఒకసారి, సుదీర్ఘకాలం కొనసాగుతుందని మరోసారి చెప్పుకొస్తున్నారు. ఇలా బుధవారం పరస్పరం భిన్నమైన ప్రకటనలు చేశారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం రెండు వారాల్లో ముగియవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తమతో తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసే సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి వెళ్లిపోతామని చెప్పారు. హోర్ముజ్ జలసంధి బాధ్యత తమది కాదని.. దాన్ని ఉపయోగించుకునే దేశాలదేనని పేర్కొన్నారు. అదే సమయంలో నాటో దేశాలు అమెరికాకు ఎలాంటి సాయమూ చేయడం లేదని, అమెరికా నాటో నుంచి బయటికి వచ్చే ప్రతిపాదన ఉందని ప్రకటించారు. ఇక బుధవారం సాయంత్రం యుద్ధం కొనసాగుతుందంటూ భిన్నమైన ప్రకటన చేశారు. ‘‘కాల్పుల విరమణ చేపడదామని అమెరికాను ఇరాన్ కొత్త ప్రభుత్వ అధ్యక్షుడు కోరారు. ఆయన గత ప్రభుత్వ నేతలకంటే తెలివైనవారు, తిరుగుబాటు మనస్తత్వం అంతగా లేనివారు. అయితే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిస్తే కాల్పుల విరమణను పరిశీలిస్తామని చెప్పాం. అప్పటివరకు ఇరాన్ ఇక రాతియుగంలోకి వెళ్లిపోయే స్థాయిలో విధ్వంసం సృష్టిస్తాం’’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు. అయితే ఇరాన్ సుప్రీంలీడర్ మృతిచెందినా ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పదవిలోనే ఉన్నారు. ప్రభుత్వంలో ఎలాంటి పొరపొచ్చాలున్న దాఖలాలు కూడా లేవు. మరి ట్రంప్‌ను ఏ నూతన అధ్యక్షుడు కోరారనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా, ఇరాన్ కాల్పుల విరమణ ఏదీ కోరలేదని ఆ దేశ విదేశాంగ శాఖ, ఐఆర్‌జీసీ ప్రకటించడం గమనార్హం. బుధవారం గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్‌పై వంద క్షిపణులు, డ్రోన్లు, 200 రాకెట్లతో ఇరాన్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇరాక్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ దాడులు చేశాయని ఐఆర్‌జీసీ వెల్లడించింది. కాగా, అధ్యక్షుడు ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేయనున్నట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ వెల్లడించింది. బుధవారం రాత్రి 9గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6.30 గంటలకు) వాషింగ్టన్‌లో ఆయన మీడియాతో మాట్లాడనున్నట్టు తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం కా రణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతు న్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
విట్కాఫ్ టచ్‌లో ఉన్నారు: ఇరాన్
అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కా్‌ఫతో తనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. విట్కాఫ్ నుంచి తనకు నేరుగా పలు సందేశాలు అందాయని.. అంత మాత్రాన తాను అమెరికాతో చర్చలు జరుపుతున్నట్టు కాదని పేర్కొన్నారు. అమెరికాకు నిజాయతీ లేదని, ఆ దేశాన్ని నమ్మే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News