Share News

ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టు షాక్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 06:02 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి ఈ జీన్‌ కారోల్‌ దాఖలు చేసిన లైంగిక వేధింపులు, పరువు నష్టం కేసులో...

ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టు షాక్‌

  • లైంగిక వేధింపుల కేసులో వెంటనే పరిహారం చెల్లించాలని తీర్పు

  • రచయిత్రి కారోల్‌కు 5.8 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని ఆదేశం

  • తీర్పును సవాల్‌ చేస్తూ ట్రంప్‌ అప్పీల్‌

  • విచారణకు నిరాకరించిన న్యాయస్థానం

న్యూయార్క్‌, జూలై 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి ఈ జీన్‌ కారోల్‌ దాఖలు చేసిన లైంగిక వేధింపులు, పరువు నష్టం కేసులో కోర్టు ఖాతాలో ఉన్న రూ.5.8 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.55 కోట్లు) పరిహారాన్ని ఆమెకు వెంటనే విడుదల చేయాలని మన్‌హట్టన్‌లోని ఫెడరల్‌ జడ్జి లూయిస్‌ ఏ కాప్లాన్‌ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ ట్రంప్‌ న్యాయవాదులు చేసిన అప్పీల్‌ను సైతం అప్పీలేట్‌ కోర్టు తిరస్కరించింది. 1996లో మన్‌హట్టన్‌లోని ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో ట్రంప్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ జీన్‌ కారోల్‌ ఆరోపించారు. ఇదే విషయాన్ని 2019లో ప్రచురితమైన తన పుస్తకంలోనూ ప్రస్తావించారు. అయితే కారోల్‌ తనకు తెలియదని.. ఆమె ఆరోపణలు పచ్చి అబద్ధమని ట్రంప్‌ కొట్టిపారేశారు. దీంతో తనపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కారోల్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే 2023 మేలో మన్‌హట్టన్‌ ఫెడరల్‌ కోర్టు జ్యూరీ.. లైంగిక వేధింపులు, పరువు నష్టానికి ట్రంప్‌ను బాధ్యుడిగా తేల్చుతూ 5 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు ట్రంప్‌ ఆ మొత్తాన్ని కోర్టు ఖాతాకు జమ చేశారు. వడ్డీతో కలిపి అది 5.8 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అయితే ఈ సివిల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ ట్రంప్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు యూఎస్‌ సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కారోల్‌కు పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమమైంది. ‘ట్రంప్‌ ఏళ్ల తరబడి కేసును సాగదీస్తూ వస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు పరిహారం చెల్లించాల్సిన సమయం వచ్చింది’ అని జడ్జి లూయిస్‌ ఏ కాప్లాన్‌ తన తీర్పులో పేర్కొన్నారు. కాగా, జీన్‌ కారోల్‌ దాఖలు చేసిన మరో పరువు నష్టం కేసుకు సంబంధించి 2024లో మన్‌హట్టన్‌ ఫెడరల్‌ కోర్టు జ్యూరీ ట్రంప్‌కు 83.3 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.794 కోట్లు) భారీ జరిమానా విధించగా.. దీనిపై ఆయన చేసిన అప్పీల్‌పై విచారణ కొనసాగుతోంది.


ట్రంప్‌ పదవికి ముప్పు ఉందా..?

తాజా కోర్టు తీర్పుతో ట్రంప్‌ అధ్యక్ష పదవి కోల్పో యే ప్రమాదమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో ఆయనకు ఎటువంటి శిక్ష పడలేదు. ఒకవేళ క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలినా అమెరికా రా జ్యాంగ నిబంధనలప్రకారం ట్రంప్‌ పదవికి ఎలాంటి చట్టపరమైన ముప్పు లేదని అంటున్నారు. యూఎస్‌ రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. దేశాధ్యక్షుడిగా పోటీ చేయడానికి, ఆ పదవిలో కొనసాగడానికి మూడు ప్రధాన అర్హతలుండాలి. అభ్యర్థి వయసు కనీసం 35 ఏళ్లుండాలి. అమెరికాలోనే జన్మించి ఉండాలి. కనీసం 14 ఏళ్ల పాటు అమెరికాలో నివసించి ఉండాలి. క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలినా లేదా శిక్ష పడినా సదరు వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగకుండా అడ్డుకునే చట్టపరమైన అధికారం ఎవరికీ లేదు.

ఈ వార్తలనూ చదవండి:

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 10 , 2026 | 06:02 AM