ఇరాన్ వారం పాటు యుద్ధ విరామం అడిగితే..10 రోజులిచ్చా: ట్రంప్
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:40 AM
ఇరాన్‌లోని కీలక విద్యుత్, ఇంధన వ్యవస్థలపై దాడులను మరో పది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
6వ తేదీ రాత్రి 8 గంటల దాకా దాడులు చేయొద్దని నిర్ణయించాం
హోర్ముజ్ నుంచి మా 10 నౌకలను వెళ్లనివ్వడంతోనే ఈ ఉదారత: ట్రంప్
దాడుల వాయిదా భారీ దాడి కోసమేనా?
ఖెష్మ్, ఖార్గ్‌ల్లో ఒక దీవి స్వాధీనానికి ప్లాన్?
ఇరాన్‌కు టోల్ కట్టాకే ఆ నౌకలకు అనుమతి?
హోర్ముజ్‌లో చార్జీల వసూలుకు ఇరాన్ చట్టం?
పెంటగాన్ వద్ద మళ్లీ పెరిగిన పిజ్జా ఆర్డర్లు!
హోర్ముజ్ తెరవడం కోసం అమెరికాకు రోజుకు రూ.19 వేల కోట్ల ఖర్చు.. ఆ దేశ సెనేటర్ ఫైర్
వాషింగ్టన్, మార్చి 27: ఇరాన్‌లోని కీలక విద్యుత్, ఇంధన వ్యవస్థలపై దాడులను మరో పది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ ఆరో తేదీ రాత్రి 8 గంటల వరకు దాడులు చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ఒప్పందం కోసం వాళ్లు వారం రోజులు సమయం చాలా మర్యాదగా అడిగారు. నేను పది రోజులు ఇస్తున్నానని చెప్పా. హోర్ముజ్ జలసంధి నుంచి అమెరికా నౌకలను వెళ్లనివ్వడంతో దాడుల వాయిదాపై ఉదారంగా వ్యవహరించా.. చర్చల్లో భాగంగా తాము నిజాయతీగా ఉన్నామని చూపుకొనేందుకు ఎనిమిది పెద్ద చమురు నౌకలను పంపిస్తామని ఇరాన్ వాళ్లు చెప్పారు. ఆ ఎనిమిది నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటి వస్తున్నాయి. అయితే తర్వాత మరో రెండు నౌకలను కూడా పంపిస్తున్నట్టు చెప్పారు. మొత్తం 10 పెద్ద చమురు నౌకలు వస్తున్నాయి. అవి పాకిస్థాన్ జెండాలతో వస్తున్నట్టు తెలిసింది’’ అని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగానే కొనసాగుతున్నాయని, ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి రాకపోతే తీవ్రస్థాయిలో దాడి చేస్తామని పేర్కొన్నారు. చర్చల సందర్భంగా ఇరాన్ తనకు ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని, అది చమురుకు సంబంధించినదని రెండు రోజుల క్రితం ట్రంప్ పేర్కొన్నా. ఇలా చమురు ట్యాంకర్లను వెళ్లనివ్వడమే ఆ బహుమతి అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రూ.19 కోట్లు కడితేనే హోర్ముజ్ దాటేది!
పాకిస్థాన్ జెండాలతో హోర్ముజ్ దాటిన అమెరికా చమురు నౌకలు ఇరాన్‌కు ‘కప్పం’ చెల్లించాకే ముందుకు కదిలాయనే వార్తలు వస్తున్నాయి. తగిన పత్రాలతోపాటు సుమారు రూ.19 కోట్లు (2 మిలియన్ డాలర్లు) చెల్లించాకే చమురు నౌకలను హోర్ముజ్ నుంచి అనుమతిస్తున్నామని ఇరాన్ అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ఒక్కో నౌక నుంచి 2 మిలియన్ డాలర్ల చొప్పున వసూలు చేస్తున్నాం. హోర్ముజ్‌పై ఇరాన్ సార్వభౌమత్వం నెలకొందనడానికి ఇది సూచిక’’ అని ఇరాన్ ఎంపీ అలాద్దీన్ బొరోజోర్డి ఆ దేశ ప్రభుత్వ చానెల్(ఐఆర్‌ఐబీ)లో ఈ విషయాన్ని ప్రకటించారు. హోర్ముజ్‌లో నౌకల నుంచి చార్జీలు వసూలు చేయడం కోసం చట్టాన్ని తీసుకురావడానికి కూడా ఇరాన్ సిద్ధమైంది. మరోవైపు, హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా రోజుకు రూ.19 వేల కోట్లు (2 బిలియన్ డాలర్లు) ఖర్చు చేస్తోందని అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ మండిపడ్డారు. యుద్ధం కోసం రోజువారీగా చేస్తున్న ఖర్చు అంతకంటే ఎక్కువగానే ఉంటోందని చెప్పారు. అమెరికా దాడులకు ముందు హోర్ముజ్ తెరిచే ఉందని, అమెరికా తాను సృష్టించిన సమస్యను పరిష్కరించడం కోసం తానే తంటాలు పడుతోందని వ్యాఖ్యానించారు.
భూతల దాడుల కోసమే గడువు?
భూతల దాడులకు సన్నద్ధత కోసమే వ్యూహాత్మకంగా ట్రంప్ దాడుల వాయిదా ప్రకటన చేశారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజానికి ఇరాన్ కీలక దీవి ‘ఖార్గ్’ను స్వాధీనం చేసుకుని, విజయం సాధించామంటూ యుద్ధాన్ని నిలిపివేయాలని ట్రంప్ భావిస్తున్నారంటూ రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అందుకు తగినట్టుగానే పశ్చిమాసియాకు అమెరికా బలగాల తరలింపు పెరిగింది. శుక్రవారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం.. భారత్‌లో శనివారం తెల్లవారుజామున) స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ గడువు ముగిశాక.. భూతల దాడులు చేపట్టవచ్చని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
పెంటగాన్ సమీపంలో పెరిగిన పిజ్జా డెలివరీలు!
అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సమీపంలో పిజ్జా డెలివరీలు గురువారం రాత్రి ఒక్కసారిగా పెరిగాయని.. అంటే ఏదో పెద్ద పరిణామమే జరగబోతోందనడానికి ఇది సంకేతమని వార్తలు వెలువడ్డాయి. సాధారణంగా ఏదైనా దాడి చేసేముందు పెంటగాన్‌లో అధికారులంతా ఎక్కువ సేపు పనిచేసి.. నిఘా సమాచారాన్ని, బలగాల సన్నద్ధతను పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో డెస్క్ వద్దే కూర్చుని తినగలిగేలా పిజ్జాల వంటివి ఆర్డర్ చేస్తుంటారు. దీనితో సమీపంలోని పిజ్జా ఔట్‌లెట్లలో ఒక్కసారిగా ఆర్డర్లు పెరుగుతాయని అంటుంటారు. అలా గురువారం రాత్రి పెంటగాన్‌కు 3కిలోమీటర్ల దూరం లోపల ఉన్న పాపాపాజాన్స్ పిజ్జా సెంటర్‌కు 296 శాతం, డోమినోస్ పిజ్జాకు 208 శాతం ఆర్డర్లు పెరిగాయి.