Share News

గ్రీన్‌లాండ్‌ స్వాధీనానికిబలప్రయోగం చేయను

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:29 AM

గ్రీన్‌లాండ్‌పై కన్నేసి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. దాన్ని బలప్రయోగంతో స్వాధీనం చేసుకోబోమని దావో్‌సలో హామీ ఇచ్చారు.

గ్రీన్‌లాండ్‌ స్వాధీనానికిబలప్రయోగం చేయను
US President Donald Trump

  • దాన్ని డెన్మార్క్‌కు అప్పగించడమే

  • మా బుద్ధి తక్కువ పని.. దావోస్‌లో ట్రంప్‌

‘‘గ్రీన్‌లాండ్‌.. అమెరికా, రష్యా, చైనా మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. భద్రతా కారణాల రీత్యానే అమెరికా ఆ భూభాగాన్ని కోరుకుంటోంది తప్ప అరుదైన ఖనిజాల కోసం కాదు. అమిత శక్తిని, బలాన్ని ఉపయోగిస్తే తప్ప మాకు అది దక్కకపోవచ్చు. అలా చేస్తే మమ్మల్ని ఆపే శక్తి కూడా ఏదీ లేదు. కానీ, నేను అలా చేయను. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం నేను బలప్రయోగం చేస్తానని అందరూ అనుకుంటున్నారు. అలా చేయాలని నేను అనుకోవట్లేదు. చేయను కూడా. ఆ అతి పెద్ద మంచు ఖండాన్ని ఒక్క అమెరికా మాత్రమే కాపాడగలదు. దాన్ని అభివృద్ధి చేయగలదు. అలా కాపాడాలంటే యాజమాన్య హక్కు కావాలి. లీజులతో కుదరదు. వాస్తవానికి అది ఉత్తర అమెరికాలో భాగం. పశ్చిమార్థ గోళానికి ఉత్తర హద్దులో ఉంది. అది మా భూభాగం. అందుకే అమెరికా ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన చర్చలు వెంటనే ప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నాను.’’

- దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

దావోస్‌, జనవరి 21: గ్రీన్‌లాండ్‌పై కన్నేసి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. దాన్ని బలప్రయోగంతో స్వాధీనం చేసుకోబోమని దావో్‌సలో హామీ ఇచ్చారు. గ్రీన్‌లాండ్‌ను ఒక్క అమెరికా మాత్రమే కాపాడగలదన్న ఆయన.. యూరప్‌ సరైన దిశలో ప్రయాణించట్లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో దాదాపు 70 నిమిషాలపాటు ప్రసంగించిన ట్రంప్‌.. రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిప్పటి నుంచి ఇప్పటిదాకా సాధించిన విజయాల గురించి, గ్రీన్‌లాండ్‌ గురించి, సుంకాలు, పర్యావరణం, వలసలు.. ఇలా పలు అంశాల గురించి ప్రస్తావించారు. ‘‘చాలామంది స్నేహితులు, కొద్దిమంది శత్రువులకు అభినందనలు’’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్‌.. తన ప్రసంగంలో గ్రీన్‌లాండ్‌ గురించే ప్రధానంగా ప్రస్తావించారు. రెండో ప్రపంచయుద్ధ సమయానికి అమెరికా అతిపెద్ద శక్తి అని.. గ్రీన్‌లాండ్‌ను తామే రక్షించి, యుద్ధం ముగిసిన తర్వాత డెన్మార్క్‌కు అప్పగించామని.. ఇప్పుడు తమ దేశం మరింత శక్తిమంతమైనదని గుర్తుచేశారు. ‘‘అమెరికా తప్ప.. ఏ ఒక్కదేశమో, దేశాల కూటమో గ్రీన్‌లాండ్‌ను కాపాడలేదు.


అమెరికా అతి పెద్ద శక్తి. అందరూ అనుకుంటున్నదానికన్నా శక్తిమంతమైనది. ఈ విషయాన్ని వెనెజువెలా లో రెండువారాల క్రితమే అంతా గమనించి ఉంటా రు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో డెన్మార్క్‌ జర్మనీతో కేవలం ఆరుగంటలపాటు పోరాడి చేతులెత్తేసినప్పుడు.. తననుగానీ, గ్రీన్‌లాండ్‌నుగానీ కాపాడుకోలేని సమయంలో అమెరికా రంగంలోకి దిగింది’’ అని గుర్తుచేశారు. అసలు ఆనాడు తాము (అమెరికా) వారికి ఆ భూభాగాన్ని ఇవ్వడమే బుద్ధి తక్కువ పని అని వ్యాఖ్యానించారు. అప్పుడు తామే లేకపోతే ఈపాటికి డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌వాసులు జర్మన్‌, కొద్దిపాటి జపనీస్‌ మాట్లాడుతూ ఉండేవని ఎద్దేవా చేశారు. డెన్మార్క్‌కు కృతజ్ఞత లేదన్న ట్రంప్‌.. ఆ దేశం నుంచి గ్రీన్‌లాండ్‌ను తీసుకునే విషయంలో తక్షణమే చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. గతంలో యూరప్‌ దేశాలు కూడా ప్రపంచంలో పలు భూ భాగాలను స్వాధీనం చేసుకున్నాయి కాబట్టి.. తాను గ్రీన్‌లాండ్‌ను అడగడంలో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా.. తన గ్రీన్‌లాండ్‌ ఆశకు అడ్డంకిగా నిలుస్తున్న నాటో సభ్య దేశాలకు ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చే శారు. దశాబ్దాలుగా వారికి తాము ఇచ్చిన దానికన్నా వారి నుంచి అడుగుతున్నది చాలా తక్కువని గుర్తుచేశారు. ‘‘(గ్రీన్‌లాండ్‌ స్వాధీనానికి) మీరు సరేనంటే మేం కృతజ్ఞులుగా ఉంటాం. ‘కాదు’ అంటే మాత్రం.. మేం గుర్తుపెట్టుకుంటాం’’ అని పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ అంతలోనే.. ‘‘ఇది నాటో కు హెచ్చరిక కాదు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.


యూర్‌పపై అసహనం..

ప్రపంచ దేశాలపై తాను విధించిన సుంకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని అమెరికాపరోగతి కోసం, ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నట్టు ట్రంప్‌ తెలిపారు. రెండేళ్ల క్రితం అమెరికా ఒక మృత దేశమని.. ఇప్పుడు మళ్లీ బతికి, బలంగా నిలబడిందని, అమెరికన్లుతనను ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉన్నారని సొంత గొప్పలు చెప్పి, జబ్బలు చరుచుకున్నారు. ‘‘ఈ భూగోళానికి అమెరి కా ఆర్థిక ఇంజన్‌లాంటిది. అమెరికా ఎదిగినప్పుడు ప్రపంచం మొత్తం ఎదుగుతుంది. ఇదే చరిత్ర’’ అని ఘనంగా చెప్పుకొన్న ఆయన.. యూరప్‌ దేశాలపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. యూరప్‌ ప్రజల గు రించి అమెరికా ఆలోచిస్తుందని.. తన తాతముత్తాతలు కూడా యూరప్‌ నుంచి వచ్చినవారే కాబట్టి, తనకు కూడా యూర్‌ప తో లోతైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. కానీ.. యూరప్‌ తనంత తానుగా బలహీనపడుతోందని అభిప్రాయపడ్డారు. యూర్‌పను బలహీన ఖండంగా అభివర్ణించారు. ‘‘యూరప్‌ దేశాలు ఇప్పుడు తమ మార్గాన్ని మార్చుకోవాలి. గత పదేళ్లలో అవి ఏర్పరచుకున్న ఆలోచనాసరళిని విడిచి బయటకు రావాలి. వారు తమను తామే నాశనం చేసుకుంటున్నారు. మాకు బలమైన మిత్రులు కావాలి. బలహీనమైన మిత్రులు కాదు. యూరప్‌ బలంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. వలసలు, ఆర్థిక పగ్రతి, సంస్కృతి వంటి విషయాల్లో యూరప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్గత రాజకీయాలకే పరిమితం కావని.. వాటి ప్రభావం ఆ దేశాల భద్రతతో పాటు, అమెరికా, ప్రపంచ భద్రతపై కూడా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఉక్రెయిన్‌పై..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని గంటల వ్యవధిలో పరిష్కరించగలనని తాను అనుకున్నానని.. కానీ, అదంత సులభం కాదని అర్థమైందని ట్రంప్‌ తెలిపారు. అయితే, ఆ యుద్ధాన్ని ఆపే ఒప్పందానికి తాను బాగా దగ్గరలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. పుతిన్‌, జెలెన్‌స్కీ ఈ యుద్ధాన్ని ఇప్పుడు ఆపకపోతే అది మూర్ఖత్వమేనన్నారు. ‘‘కానీ వాళ్లు మూర్ఖులు కాదని నాకకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో పర్యావరణ లాబీ గురించి కూడా ప్రస్తావించిన ట్రంప్‌.. యూర్‌పలో కొంతమంది మూర్ఖులు పవనవిద్యుత్తు విషయంలో అమాయకంగా వ్యవహరిస్తున్నారని.. చైనా వారికి విండ్‌మిల్స్‌ను విక్రయించి సొమ్ము చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. చైనాలో ఎక్కడా విండ్‌మిల్స్‌ ఉన్నట్టు తాను చూడలేదని.. వాటివల్ల పక్షులు చనిపోతాయని, ప్రకృతి అందాలను చెడగొడతాయని.. మూర్ఖులే వాటిని కొంటారని దుయ్యబట్టారు. ‘‘విద్యుత్తు ద్వారా డబ్బు సంపాదించాలి తప్ప కోల్పోకోడదు. విండ్‌మిల్స్‌ వల్ల డబ్బు కోల్పోతారు’’ అని పేర్కొన్నారు. ఇక, అమెరికా నుంచి ఎన్నో ఉచితాలను పొందుతున్న కెనడా.. అమెరికా పట్ల కృతజ్ఞతగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఫాన్స్‌ అధ్యక్షుడు కంటి సమస్య కారణంగా పెట్టుకున్న కళ్లజోడు గురించి కూడా ట్రంప్‌ ప్రస్తావించారు. ‘‘ఆ అందమైన చలువ కళ్లద్దాలతో ఆయన్ను నిన్న చూశాను. అసలేం జరిగింది?’’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రసంగం అనంతరం 20 నిమిషాలపాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారత ప్రధాని మోదీ పట్ల తనకు గౌరవం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్‌తో మంచి వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గణతంత్ర వేడుకలే లక్ష్యం..26-26 ఉగ్రదాడులు?

ఐస్‌క్రీం తింటూ గిన్నిస్‌ రికార్డు

Updated Date - Jan 22 , 2026 | 06:52 AM