Share News

తెలుగు రాష్ట్రాల హజ్‌ యాత్రికులకు భోజన కష్టాలు

ABN , Publish Date - May 13 , 2026 | 05:14 AM

హజ్‌యాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ తిండి కష్టాలను ఎదుర్కొంటున్నారు. తమ రుచులకు అనుగుణంగా ఆహార వసతి లేకపోవడంతో...

తెలుగు రాష్ట్రాల హజ్‌ యాత్రికులకు భోజన కష్టాలు

  • భారతీయ రుచులు లభించక అరకొర తిండి

  • రెస్టారెంట్లలో ధరల మంట.. భోజన వసతిపై ఫిర్యాదులు

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : హజ్‌యాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ తిండి కష్టాలను ఎదుర్కొంటున్నారు. తమ రుచులకు అనుగుణంగా ఆహార వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి 9వేల మంది హజ్‌యాత్రలో పాల్గొననుండగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో యాత్రికులు విచ్చేశారు. మక్కా, మదీనాలో పరిమితంగా ఉన్న దక్షిణాసియా రెస్టారెంట్లలో తెలుగువారికి ఇష్టమైన అన్నం, పప్పు, పులుసు వగైరాలు కాకుండా రొట్టెలు, ఉత్తరాది వంటకాలు పెడుతుండటంతో వారికి ముద్ద దిగడం లేదు. రొట్టెలు, అరబ్బీ తిండి తమవళ్ల కాదని వాపోతూ.. అన్నం ఎక్కడ దొరుకుతుంది? అని ఆరా తీస్తున్నారు. పోనీలే.. ఏదైతేనేమీ తినేద్దాం అనుకుంటే రెస్టారెంట్లలో భారీగా ఉన్న ధరలను చూసి హడలిపోతున్నారు. గతానికి భిన్నంగా మక్కాలో భారతీయులకు దూర ప్రాంతాల్లో వసతి గృహాలు కేటాయించడంతో అక్కడ భారతీయ వంటకాల రెస్టారెంట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మునుపు యాత్రికులకు తాము బసచేసిన భవనాల్లోని వంటశాలల్లో వండుకొనే సౌకర్యం ఉండేది. అయితే వంటలు వండుకునేటప్పుడు యాత్రికుల నిర్లక్ష్యం కారణంగా చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో సౌదీ ప్రభుత్వం.. అక్కడ వండుకోవడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఇండోనేసియా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ తదితర దేశాల యాత్రికుల వసతి గృహాల్లో కూడా వంటల నిషేధం అమల్లో ఉంది. అయితే ఆ దేశాల ప్రభుత్వాలు హజ్‌యాత్ర సందర్భంగా తమ భక్తుల కోసం భోజన వసతి కల్పించేందుకు వారి నుంచి అదనంగా కొంత రుసుమును వసూలు చేసి, క్యాటరింగ్‌ ఏర్పాట్లు చేశాయి. దీంతో భోజన వసతికి సంబంధించిన సమస్యలపై మక్కా, మదీనాలోని భారత దౌత్యవేత్తలు, ఇతర అధికారులకు యాత్రికులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 05:14 AM