స్పెయిన్‌లో కార్చిచ్చు.. 11 మంది మృతి, 19 మంది గల్లంతు.. వందలాది మంది నిరాశ్రయులు!
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:04 PM
దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా రీజియన్‌ను భారీ కార్చిచ్చు కాల్చి బూడిద చేస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గల్లంతయ్యారు. మంటలు ఉధృతంగా వ్యాపించడంతో సుమారు 600 మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు.
మాడ్రిడ్ (స్పెయిన్), జులై 10: దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా (Andalusia) రీజియన్‌ను భారీ కార్చిచ్చు కాల్చి బూడిద చేస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గల్లంతయ్యారు. మంటలు ఉధృతంగా వ్యాపించడంతో సుమారు 600 మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు. ప్రతికూల గాలుల మధ్య అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలు
అండలూసియా ప్రాంతీయ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, అల్మేరియా ప్రావిన్స్‌లోని లాస్ గల్లార్డోస్, బెడార్, అంటాస్ మునిసిపాలిటీలపై ఈ కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపింది. తొలుత మరణాల సంఖ్య 12 గా ప్రకటించినప్పటికీ, అధికారులు దానిని 11 గా సవరించారు.
శరణాలయాల్లో బాధితులు:
దాదాపు 600 మంది ఇళ్లను వదిలి వెళ్లగా, రాత్రికి రాత్రే 120 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అల్మోకైజర్, ఫ్యూయెంటె డెల్ అల్బారికో, లాస్ పినోస్, లా సెరెనా, పినార్ వంటి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. శరణార్థులుగా మారిన వారిలో 74 మందికి లుబ్రిన్ థియేటర్‌లో, మరో 74 మందికి గరుచా థియేటర్‌లో అధికారులు తాత్కాలిక వసతి కల్పించారు.
3,150 హెక్టార్లు బూడిద.. హై అలర్ట్‌లో అధికారులు
ఈ భీకర కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు దాదాపు 3,150 హెక్టార్ల అటవీ భూమి పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ప్రస్తుతం మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలు, మంటల్ని అదుపు చేయడం కష్టతరంగా మారిందని అండలూసియా అత్యవసర సేవల మంత్రి ఆంటోనియో సాంజ్ కాబెల్లో తెలిపారు. అంతేకాదు, గాలుల దిశ మారే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటికీ హై అలర్ట్ కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అక్కడ 'ప్లాన్ ఇన్ఫోకా' (Plan Infoca) అత్యవసర ప్రణాళికను అమలు చేస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన బాధితులు
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా, వారిలో నలుగురు పొగ పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోస సమస్యలు, తీవ్రమైన కాలిన గాయాలకు గురయ్యారు. వీరిని మెరుగైన చికిత్స కోసం సెవిల్లెలోని 'విర్గెన్ డెల్ రోసియో' ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురికి ఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అధికారులు జారీ చేసే భద్రతా ఆదేశాలను, తరలింపు సూచనలను ప్రజలందరూ కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం చేయకుండా ప్రాణాలు కాపాడుకోవాలని అత్యవసర సేవల విభాగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్