Share News

ఈ ఏడాదే స్వదేశానికి తిరిగెళతాను: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:41 PM

ఈ ఏడాదిలోనే తాను స్వదేశానికి తిరిగి వెళతానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. అవామీ లీగ్ కేవలం ఒక రాజకీయ సంస్థ కాదని, ఒక శక్తి అని వ్యాఖ్యానించారు.

ఈ ఏడాదే స్వదేశానికి తిరిగెళతాను: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
Sheikh Hasin

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగడంతో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ కూడా నిషేధానికి గురైంది. చివరకు అక్కడి కోర్టు ఆమెకు మరణ శిక్ష కూడా విధించింది. అయితే, ప్రస్తుత గడ్డు పరిస్థితులను తాను దీటుగా ఎదుర్కోగలనని షేక్ హసీనా చెబుతున్నారు. ఇటీవల అవామీ లీగ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు తిరిగెళతానని స్పష్టం చేశారు.

అవామీ లీగ్ కేవలం రాజకీయ పార్టీ కాదని ఒక శక్తి అని మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను దేశ స్వాతంత్ర్యంపై దాడిగా అభివర్ణించారు. తాను బంగ్లాదేశ్‌కు వెళ్లడమనేది వ్యక్తిగత లక్ష్యం కాదని, అది ప్రజల రాజకీయ హక్కులకు సంబంధించిన అంశమని చెప్పారు. తాను అధికారం కోసం రాజకీయాలు చేయనని అన్నారు. ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని చెప్పారు.


తనపై కోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయమైనదని కూడా షేక్ హసీనా స్పష్టం చేశారు. అది రాజ్యాంగ వ్యతిరేకమని, రాజకీయ దురుద్దేశాల వల్ల ఆ తీర్పు వెలువడిందని చెప్పారు. రాజకీయ ప్రతీకారాలకు న్యాయవ్యవస్థను సాధనంగా మార్చారని మండిపడ్డారు. తనకు మరణం అంటే భయం లేదని కూడా అన్నారు. గతంలో తనపై పన్నిన ఎన్నో కుట్రలను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. మొత్తం కుటుంబాన్ని కోల్పోయినా నిలదొక్కుకున్నానని చెప్పారు.

బంగ్లాదేశ్ మట్టిలోంచి తమ పార్టీ పుట్టినదని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నోసార్లు దాడులు జరిగినా ప్రజల మద్దతుతో తాము నిలదొక్కుకుందని చెప్పారు. ప్రజల మద్దతు తమకు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. దేశవ్యతిరేక శక్తులు కుట్రపూరితంగా తమను అధికారం నుంచి తప్పించారని అన్నారు. ఈ కష్టకాలంలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, పార్టీ కార్యకర్తలు జూన్ 23న బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయకుండా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు, అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి..

Updated Date - Jun 28 , 2026 | 05:58 PM